ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా

Two Young Mens Drowned While Swimming In The Pond - Sakshi

సాక్షి,కర్నూలు(ఓర్వకల్లు): ఆనందంగా ప్రకృతిలో విహరిద్దామని వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరు మృత్యుఒడి చేరారు. ఈ విషాద ఘటన ఓర్వకల్లు రాక్‌ గార్డెన్‌ వద్ద ఆదివారం చోటు చేసుకుంది.  కర్నూలు నగరానికి చెందిన సయ్యద్‌ అసద్‌ ఉసామా(30), సయ్యద్‌ అమీరుద్దీన్‌(25), డి. షకీల్‌ అహ్మద్, సయ్యద్‌ మహ్మద్‌ అఖిల్‌ స్నేహితులు. ఇటీవల బక్రీద్‌ పండుగను  జరుపుకున్న ఆనందంలోసరదాగా పిక్నిక్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం నలుగురు యువకులు రెండు బైక్‌లపై   9.30 గంటలకు రాక్‌ గార్డెన్‌కు చేరుకున్నారు.

అక్కడ ఎంట్రీ పాసులు తీసుకొని స్థానిక లింగం వారి చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో సరదాగా ఈత కొట్టాలని నీటిలోకి దిగారు. చెరువులోకి దిగిన ఐదు నిమిషాలలోనే కర్నూలు మమతా నగర్‌కు చెందిన సయ్యద్‌ అన్వర్‌ బాషా కుమారుడు సయ్యద్‌ అసద్‌ ఉసామా, నరసింగరావు పేటకు చెందిన సయ్యద్‌ అనిషుద్దీన్‌ కుమారుడు సయ్యద్‌ అమీరుద్దీన్‌కు ఈత సరిగ్గా రాకపోవడంతో నీట మునిగి పోయారు. విషయం గమనించిన తోటి మిత్రులు స్థానిక హరితా రెస్టారెంట్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి వెళ్లి చెరువులో మునిగిపోయిన ఇద్దరు యువకుల కోసం గాలించగా అప్పటికే మృతి చెంది కనిపించారు.

మృత దేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కర్నూలు డీఎస్పీ మహేష్‌, రూరల్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్‌ఐ మల్లికార్జున సిబ్బందితో చెరువు వద్దకు చేరుకొని మృత దేహాలను పరిశీలించారు. సయ్యద్‌ అసద్‌ ఉసామా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య అమీనా బేగం, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అమీరుద్దీన్‌కు పెళ్లి కాలేదు. నగరంలో అమెజాన్‌ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ, తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా వుండేవాడు. ప్రమాద స్థలం వద్ద మృతుల కుటుంబీకులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.  పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top