రూ.50 లక్షలతో ఇంటి నుంచి వెళ్లారు.. తిరిగి రాలేదు

Two Persons Missing Manthani Went For Land Registration - Sakshi

రూ.50లక్షలతో కాటారం బయలుదేరిన రాజేశం, మల్లయ్య

అక్కడికి వెళ్లలేదు.. ఇంటికి చేరలేదు..

మంథని సమీపంలో ద్విచక్రవాహనం గుర్తింపు

రామగిరి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు

జాగిలాలతో గాలింపు.. సీసీ పుటేజీల పరిశీలన 

మంథని: భూ రిజిస్ట్రేషన్‌ కోసం రూ.50లక్షలతో ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరిన ఇద్దరు వ్యక్తుల అదృశ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కు వెళ్లకుండా.. ఇంటికి రాకుండా.. మార్గంమధ్యలో ద్విచక్రవాహనం ఉండడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామగిరి మండలం లద్నాపూర్‌కు చెందిన ఉడుత మల్లయ్య, చిప్ప రాజేశంలు నాలుగేళ్ల క్రితం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం శివారులో బిల్క్‌ ఉన్నీసా బేగంకు (ప్రస్తుతం హైదరాబాద్‌ పాతబస్తీలో ఉంటున్నారు) చెందిన భూమిని కొనుగోలు చేశారు.

అయితే భూమికి సంబంధించి ఇరువర్గాల మధ్య మనస్పర్థలు రావడంతో రిజిస్ట్రేషన్‌ నిలిచిపోయింది. అయితే రాజేశం, మల్లయ్యలు కొనుగోలు చేయాలనుకున్న భూమిని సదరు భూయజమానులు వేరేవారికి విక్రయించారు. ఈ విషయమై పలుసార్లు పంచాయితీలు జరిగాయి. ఈక్రమంలో రాజేశం, మల్లయ్యకు మరోచోట ఉన్న భూమిని ఎకరాకు రూ.10లక్షల చొప్పున సదరు భూయజమానులు విక్రయించేందుకు ఒప్పందం జరిగింది. ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రిజిస్ట్రేషన్‌ కోసం రూ.50 లక్షలతో ద్విచక్రవాహనంపై కాటారం బయలుదేరారు. అయితే రిజిస్ట్రేషన్‌ వద్దకు వెళ్లకపోవడం, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

కాగా ఆదివారం మంథని మండలం భట్టుపల్లి సమీపంలో మైసమ్మ ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం నిలిపి ఉందనే సమాచారం మేరకు పోలీస్‌ జాగిలాలతో గాలింపు చేపట్టారు. మంథని నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కొయ్యూర్‌ పోలీస్‌స్టేషన్, కాటారం వరకు ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. సమీప అటవీ ప్రాంతాల్లో సైతం గాలింపు చేపడుతున్నారు. రూ.50లక్షలతో బయలుదేరిన విషయం ఎవరెవరికి తెలుసు, ఇద్దరు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఎంత దూరం ద్విచక్రవాహనంపై వెళ్లారు, తర్వాత వారే వాహనం మార్చారా, ఇంకెవరిదైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

( చదవండి: మానవత్వం చాటిన మగువ..) 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top