ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో నా కుమార్తెకు చిత్రహింసలు | Mother Protests Outside Guntur Police Office Over Missing Daughter | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో నా కుమార్తెకు చిత్రహింసలు

Jan 13 2026 1:46 PM | Updated on Jan 13 2026 2:53 PM

Mother Protests Outside Guntur Police Office Over Missing Daughter

గుంటూరు:  ‘‘నా కుమార్తె వారం రోజులుగా కనిపించడం లేదు..అసలు బతికే ఉందో..చనిపోయిందో తెలియడం లేదు...అల్లుడిని అడిగితే బెదిరిస్తున్నాడు..నా బిడ్డ ప్రాణాలతో కావాలంటూ’’ ఓ తల్లి సోమవారం గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. కుమార్తెను చిత్రహింసలకు గురిచేస్తున్న ఆమె భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. నా బిడ్డ నాకు కావాలి, ప్రాణాలతో కావాలి అంటూ ఫ్లెక్సీ చేతపట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది.

 అనంతరం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడింది. వివరాలు ఇలా... బాపట్ల జిల్లా కూనపద్మావతినగర్‌ జగన్‌ కాలనీకి చెందిన నంబూరు లక్ష్మి కుమార్తె వెంకటేశ్వరమ్మ, పౌలురాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఐదు సవర్ల బంగారు గొలుసు తీసుకుని బ్యాంక్‌లో తనఖా పెట్టాడు. ఇటీవల మరో ఎకరం పొలం రాసివ్వాలంటూ భార్యపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. వారం రోజులుగా భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. 

అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదు. నా బిడ్డ బతికే ఉందో.. చనిపోయిందో తెలియడంలేదని లక్ష్మి వాపోయింది. కుమార్తె విషయమై అల్లుడ్ని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త చిత్రహింసలు భరించలేక గతంలో కుమార్తె పలుమార్లు జిల్లా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేసింది. పౌలురాజుకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు ఉందని, ఆయన అండదండలతోనే తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement