న్యూ ఇయర్‌ వేళ విషాదం.. హైదరాబాద్‌లో గోదావరివాసులు మృతి | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ వేళ విషాదం.. హైదరాబాద్‌లో గోదావరివాసులు మృతి

Published Mon, Jan 2 2023 8:42 AM

Two Members Of AP Residents Died In Hyderabad Road Accident - Sakshi

హైదరాబాద్‌: కొత్త సంవత్సరం తొలి రోజే ఇద్దరు పాదచారులకు చివరి రోజైంది. న్యూ ఇయర్‌ పార్టీ లో పాల్గొన్న ఇద్దరు యువకులు తెల్లవారుజాము వరకు మత్తులో జోగారు. నిషాలో తమ కారులో ఇంటికి బయలుదేరారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ృ2లో వీరి వాహనం అదుపు తప్పి పాదచారులపైకి దూసుకుపోయింది. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మరణించగా.. మరికొందరు క్షతగాత్రులయ్యారు. మొత్తం మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.  

మృతులిద్దరూ గోదావరి వాసులే 
ఏపీలోని కోనసీమ జిల్లా ర్యాలి గ్రామానికి చెందిన అవిడి శ్రీను (50) నగరానికి వలస వచ్చాడు. పెయింటర్‌గా పనిచేస్తూ కొండాపూర్‌లో భార్య సీత, ముగ్గురు కుమార్తెలతో ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని రాయల్‌ టిఫిన్‌ సెంటర్‌ వద్ద టీ తాగాడు. కొండాపూర్‌ వెళ్లడానికి రోడ్డు దాటుతున్నాడు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన భీమవరపు ఈశ్వరి (55) కూడా అదే సమయంలో రోడ్డు దాటుతోంది. నగరానికి వలస వచ్చిన ఆమె బంజారాహిల్స్‌ ఇందిరానగర్‌లో ఉంటోంది. కొన్నాళ్ల క్రితం బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో హెల్పర్‌గా పని చేసి మానేసింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఆమె కుమారుడు అరుణ్‌కుమార్‌ బాచుపల్లిలో నివసిస్తున్నాడు. 

తనిఖీలు ముగిసే వరకు ఆగి... 
న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న విద్యానగర్‌కు చెందిన కొడాలి ప్రణవ్‌ (21), నాచారంకు చెందిన పోలసాని శ్రీ రావు (21) ఈ విషయం గమనించి తనిఖీలు ముగిసిన తర్వాత కారులో ఇంటికి బయలుదేరారు. మితిమీరిన వేగంతో వస్తున్న కారు రాయల్‌ టిఫిన్‌ సెంటర్‌ వద్ద రెండు కార్లను ఢీకొని తర్వాత డివైడర్‌ను ఢీకొట్టి గాల్లోకి లేచి పల్టీలు కొట్టి రోడ్డు దాటుతున్న శ్రీను, ఈశ్వరిలను బలంగా ఢీకొట్టింది. దీంతో వీరిద్దరూ గాల్లోకి ఎగిరి పది అడుగుల దూరంలో ఉన్న ఓ ఫొటో స్టూడియో బోర్డుకు తగిలి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రమా దంలో ప్రణవ్, శ్రీవర్ధన్‌లకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు.  

Advertisement
Advertisement