డ్రగ్స్‌ కేసు: కస్టడీ నుంచి పరారైన టాలీవుడ్‌ నటి

Tollywood Actress Accused In Drugs Case Escapes NCB Custody - Sakshi

ముంబై: ముంబైలో డ్రగ్స్‌ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలీవుడ్‌ నటి శ్వేతా కుమారి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కస్టడీ నుంచి తప్పించుకుంది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, డ్రగ్స్‌ కేసులో నిందితురాలిగా ఉన్న శ్వేతా కుమారికి మాఫియా డాన్‌ కరీం లాలాతో సంబంధాలున్నట్టు సమాచారం. కరీం లాలాతో కలిసి ఆమెకు డ్రగ్స్ వ్యాపారంలో వాటాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీం లాలా కోసం ఎన్‌సీబీ విసృతంగా గాలింపు మొదలుపెట్టింది. కరీం లాలా దేశం విడిచి వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను ఎన్‌సీబీ అప్రమత్తం చేసింది. 

కాగా,  ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్‌ చాంద్‌ పాషా, సప్లయర్‌ సయ్యద్‌తో శ్వేతా కుమారి శనివారం రాత్రి పట్టుబడిన సంగతి తెలిసిందే. చాంద్‌ పాషా నుంచి 400 గ్రాముల డ్రగ్స్‌ను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో బాంద్రా, కుర్ల, అంధేరిలోనూ పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ చాంద్‌, సయ్యద్‌తో టాలీవుడ్‌ నటికి ఉన్న సంబంధాలపై ఎన్‌సీబీ ఆరా తీసినట్టు తెలిసింది. నిందితురాలు తెలుగులో నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినట్టుగా సమాచారం.
(చదవండి: ముంబైలో డ్రగ్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు..)

అప్‌డేట్‌: ఎన్‌సీబీ కస్టడీలోని హోటల్‌ నుంచి సోమవారం ఉదయం పరారైన టాలీవుడ్‌ నటి శ్వేతా కుమారి మధ్యాహ్నం తిరిగి ప్రత్యక్షమైంది. ఎన్‌సీబీ విచారణకు ఆమె హాజరైనట్టు అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top