‘హైటెక్‌ సెక్స్‌రాకెట్‌’లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌

Telugu Film AD Aide Held For Running Sex Racket - Sakshi

టాలీవుడ్‌కు చెందిన సురేశ్‌ బోయినతో సహా మరొకరి అరెస్టు 

ముంబై, ఢిల్లీ నుంచి మోడల్స్‌ అక్రమ తరలింపు 

వాట్సాప్‌ గ్రూప్‌లు, వెబ్‌సైట్లలో ఫొటోలు పెట్టి దందా 

పాస్‌పోర్టు, ఆధార్, పాన్‌కార్డులు స్వాధీనం 

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన హైటెక్‌ సెక్స్‌రాకెట్‌ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టీయూ) అరెస్టు చేసింది. ఈ కేసులో సురేశ్‌ బోయిన అనే టాలీవుడ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కూడా పోలీసులకు చిక్కాడు. ఈ ముఠా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలను అక్రమంగా తరలించి వాట్సాప్‌ గ్రూప్‌లు, వెబ్‌సైట్లలో వారి ఫొటోలను పెట్టి, కాల్‌సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తూ స్టార్‌ హోటళ్లు, ఓయో రూమ్‌లలో వ్యభిచారదందా నిర్వహిస్తోంది.

ఇప్పటివరకు ఈ కేసులో సైబరాబాద్‌ పోలీసులు 33 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. వీరిలో బాలీవుడ్‌లో కథారచయిత ముంబైకి చెందిన మోహిత్‌ సత్పాల్‌ అలియాస్‌ గార్గ్‌ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన మేకల అఖిల్‌కుమార్, నెల్లూరు జిల్లా కావలిలోని వెంగళ్‌రావునగర్‌కు చెందిన సురేశ్‌ బోయిన అలియాస్‌ కుమార్‌ శెట్టిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై మాదాపూర్, పంజగుట్ట ఠాణాలో ఇప్పటికే నాలుగు కేసులున్నాయి. నిందితుల నుంచి ఐదు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, స్వైపింగ్‌ మెషీన్, పాస్‌పోర్ట్, ఆధార్, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 

►బంజారాహిల్స్‌లోని హయత్‌ హైట్స్‌లో ఉండే సురేశ్‌ బోయిన ఓ ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. సినీపరిశ్రమకే చెందిన నందు అనే వ్యక్తితో కలిసి సురేశ్‌ ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని వ్యభిచారదందా మొదలుపెట్టాడు. 

►పశ్చిమ బెంగాల్, ముంబై, ఢిల్లీ వంటి నగరాల నుంచి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సురేశ్‌ నమ్మించి మోడల్స్, సినీతారలను అక్రమంగా తరలించి హైదరాబాద్‌లోని పెద్దలకు పరిచయం చేసేవాడు. లొకాంటో, స్కోక్కా, బ్లాక్‌పేజ్‌ వంటి వెబ్‌సైట్లలో అమ్మాయిల ఫొటోలు పెట్టి విటులను ఆకర్షించేవాడు. 35–40 శాతం కమీషన్‌ తీసుకొని మహిళలను సరఫరా చేసేవాడు. సురేశ్‌ ఈ దందాను కొంతకాలం గోవాలో కూడా నిర్వహించాడు. ఇప్పటివరకు 450–500 మంది బాధితులను వ్యభిచారకూపంలోకి దింపాడు.  

►2019లో గచ్చిబౌలిలోని క్లబ్‌రోగ్‌ పబ్‌లో వ్యభిచారగృహాన్ని నిర్వహిస్తున్న దీపక్‌ రాయ్‌తో అఖిల్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అఖిల్‌ మాదాపూర్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని దందా మొదలుపెట్టాడు. కొన్ని నెలల్లోనే పోలీసులు దాడి చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి 400–500 మంది మహిళలను తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దింపి, హైదరాబాద్‌లో కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తూ విటులను ఆకర్షించేవాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top