దేవికారాణి ‘రియల్‌’ దందా!

Telangana ESI Scam Rs 4.47 Crore Seized From Woman Officials - Sakshi

ఫార్మా కంపెనీల ముడుపులు రియల్‌ ఎస్టేట్‌లోకి మళ్లింపు

కుటుంబ సభ్యులు, బినామీల పేరిట పెట్టుబడి

రూ. 4.47 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఏసీబీ

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌)లో మందుల కొనుగోళ్లలో జరిగిన అవినీతి జాడలు తవ్వినకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఐఎంఎస్‌ మాజీ డైరెక్టర్‌ దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆమె రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీ లను సైతం మంగళవారం వెలుగులోకి తెచ్చింది. దేవికారాణి సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఓ రెసిడెన్షియల్‌ వెంచర్‌లో చదరపు అడుగుకు రూ.15 వేల విలువ కలిగిన 6 ఫ్లాట్లను కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మితో కలిసి రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా,  ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం.. లెక్కల్లోలేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్‌ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు రూ.2,29,30,000 మొత్తాన్ని చెక్కులు, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు.

బయటపడిన నోట్ల కట్టలు
ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు సంబంధిత వెంచర్‌ డెవలపర్‌కు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్‌ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్‌ డ్రా చేసి ఏసీబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2,000 నోట్లకట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతంలో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్‌ వద్ద లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తిరగరాసినట్‌లైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top