Anakapalle: పూడిమడక తీరంలో విషాదం

Students Missing Pudimadaka Beach Anakapalle District - Sakshi

సాక్షి, అనకాపల్లి/సాక్షి అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక మొగ వద్ద విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి పట్టణంలోని డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వారిలో ఒక విద్యార్థిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.  ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం కాగా, అవి గుడివాడ పవన్, జగదీష్, గణేష్‌లవిగా గుర్తించారు. నిన్న రాత్రి ఒక  మృతదేహం లభ్యం కాగా, ఈరోజు ఉదయం  రెండు మృతదేహాలను బయటకు తీశారు. మిగిలిన విద్యార్థుల కోసం రెండో రోజు రెండు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

పూడిమడక బీచ్‌ రాంబిల్లి మండలం సీతపాలెం బీచ్‌కు ఆనుకొని ఉంటుంది. ఇక్కడ సముద్ర తీరాన్ని ఆనుకొని కొండ ఉంటుంది. కొండ ఒక వైపు నుంచి సముద్రంలోని నీరు ఉప్పుటేరులోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఇక్కడకు పర్యాటకులు ఎవరూ వెళ్లరు. స్థానికంగా కొందరు మత్స్యకారులే ఉంటారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు సెమిస్టర్‌ పరీక్షలు రాశారు. పరీక్ష ముగియగానే 12 మంది విద్యార్థులు బైక్‌లపై పూడిమడక బీచ్‌కి వచ్చారు. అందరూ ఇక్కడ సెల్ఫీలు దిగారు. 

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వారిలో ఏడుగురు సముద్రంలో స్నానానికి దిగారు. కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తుండగా ఉవ్వెత్తున వచ్చిన అలలు సముద్రంలోకి లాగేశాయి. మిగతా విద్యార్థులు పెద్దగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు పరుగున వచ్చారు. విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను మాత్రం ఒడ్డుకు తేగలిగారు. కొన ఊపిరితో ఉన్న అతన్ని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టారు. 

ముమ్మరంగా గాలింపు చర్యలు 
జిల్లా కలెక్టర్‌ రవి పట్టాన్‌ శెట్టి, జిల్లా ఎస్పీ గౌతమి సాలి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారు. మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌ గార్డు బృందాలు, ఫైర్, మత్స్యకార గజఈతగాళ్లుతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి గాలింపు చర్యలు విస్తృతం చేస్తామని జిల్లా ఎస్పీ గౌతమి సాలి చెప్పారు. విద్యార్థులు పూడిమడక బీచ్‌కి వెళ్లడం ఇదే తొలిసారి కావడం కూడా దుర్ఘటనకు కారణమై ఉండోచ్చని పోలీసులు తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top