ఆర్టీసీ బస్సును ఢీకొట్టి.. 15 మీటర్లు ఈడ్చుకెళ్లి

Road Accident At Shayampet In Warangal District - Sakshi

మద్యం మత్తులో లారీ డ్రైవర్‌ బీభత్సం

బస్సులోని 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

వరంగల్‌ రూరల్‌ జిల్లా మందారిపేట శివారు గుట్టల వద్ద రోడ్డు ప్రమాదం

శాయంపేట: మద్యం మత్తులో ఓ ఇసుక లారీ డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా లారీని నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఆ వేగానికి ఆర్టీసీ బస్సును లారీ 15 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. లారీ సైతం అదుపుతప్పి పొలాల్లో పక్కకు ఒరిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారు గుట్టల సమీపాన నేషనల్‌ హైవేపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 45 మంది ప్రయాణికుల్లో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

హన్మకొండ నుంచి భూపాలపల్లి వైపు పరకాల డిపో బస్సు వెళ్తుండగా, కాళేశ్వరం నుంచి హన్మకొండ వైపు ఇసుక లారీ వెళ్తోంది. శాయంపేట సీఐ రమేష్‌ అక్కడికి చేరుకుని క్షతగాత్రులను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఆర్టీసీ డ్రైవర్‌ పొన్నాల రవి, కండక్టర్‌ జె.రవితోపాటు ఇల్లంతకుంట మండలం లక్ష్మక్కపల్లెకు చెందిన తాటికొండ సమ్మక్క, రేగొండ మండలం రాజక్కపల్లెకు చెందిన ఎన్‌.మల్లికాంబ, గండి విజయ, చిట్యాల మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన బెజ్జల జోత్స్న, వరంగల్‌ లేబర్‌ కాలనీకి చెందిన కూరపాటి నాగరాజు, దుగ్గొండికి చెందిన కోలా సరోజన ఉన్నట్లు సీఐ, డీఎం వివరించారు. కొందరికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. లారీ క్యాబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను స్థానికులు కాపాడగా, అతడు పరారయ్యాడు. బస్సు డ్రైవర్‌ అప్రమత్తం కాకపోతే చాలా ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

చదవండి: కరోనా మృతదేహాలను ఆలింగనం.. ఆపై అంత్యక్రియలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top