మిస్సింగ్‌ కేసుల కలకలం...ప్రేమ.. పెడదోవ | Recently Missing Cases Increases Most Of Them Girls And Womens | Sakshi
Sakshi News home page

మిస్సింగ్‌ కేసుల కలకలం...ప్రేమ.. పెడదోవ

Jul 27 2022 7:57 AM | Updated on Jul 27 2022 7:57 AM

Recently Missing Cases Increases Most Of Them Girls And Womens - Sakshi

ఇటీవలి కాలంలో ‘అదృశ్యం’ కేసులుపెరిగాయి. ఇందులో ఎక్కువ శాతం టీనేజీ అమ్మాయిలతో మహిళలు ఉండటం కలవరం రేపుతోంది. పిల్లలు విద్య పూర్తి చేశాక.. ఉద్యోగం సంపాదించాక.. వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అయితే చదువుకోవాల్సిన సమయంలోనే పిల్లలు ప్రేమలో పడి తొందరపడుతున్నారు. పెద్దలు ఒప్పుకోరని     ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. తీసుకెళ్లిన డబ్బు అయిపోయి.. కష్టాలు చుట్టు ముట్టి.. ఆదరించే వారు లేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులకూ కన్నీళ్లు మిగులుస్తున్నారు. 

రాయదుర్గం: విద్యార్థి దశలోనే కొందరు అమ్మాయిలు పెడదోవ పడుతున్నారు. తల్లిదండ్రుల గారాబంతో పాటు పర్యవేక్షణ కొరవడటంతో క్రమశిక్షణ తప్పుతున్నారు. కొందరు స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్‌కు బానిసైతే.. మరికొందరు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే చదువును పక్కనపెట్టి ప్రేమలో పడుతున్నారు. తల్లిదండ్రులకు తెలిసినా.. మందలించినా ... తమ స్వేచ్ఛను వారు ఏదో హరిస్తున్నారనుకుని అనాలోచిత నిర్ణయాలతో   తప్పటడుగులు వేస్తున్నారు. చేజేతులా భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు.

జిల్లాలోని కళ్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి  పోలీస్‌ సబ్‌ డివిజన్ల పరిధిలో 2020 నుంచి 2022 జూలై 15వ తేదీ వరకు 2,037 అదృశ్యం కేసులు నమోదయ్యాయి. ఇందులో బాలికలు, మహిళలు 1,657  మంది ఉన్నారు. చదువు కోసం పాఠశాలలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, గ్రామాల్లో కూలీలు, పరిశ్రమల్లో పనులకెళ్లే మహిళలు ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి వెళ్లిపోవడం.. రోజులు గడిచాక చేసిన తప్పు తెలుసుకుని బాధపడటం చేస్తున్నారు. చివరకు పోలీస్‌ కౌన్సెలింగ్‌తో మనసు మార్చుకుని ఇంటిబాట పడుతున్నారు.  

అదృశ్యం కేసుల్లో మచ్చుకు కొన్ని... 

  • రాయదుర్గం పట్టణం చన్నవీరస్వామి ఆలయ సమీపంలో నివసిస్తున్న ఓ యువతి షాపింగ్‌కని ఈ ఏడాది ఏప్రిల్‌ 26న ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మే 4న గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. కౌన్సెలింగ్‌ చేయగా.. గుడ్డిగా నమ్మి.. వెళ్లానని.. తన నిర్ణయం సరైంది కాదని తెలుసుకున్నానని చెప్పడంతో తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపించేశారు. 
  • రాయదుర్గం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఏప్రిల్‌ 25న నీళ్లు తేవటానికని బిందె తీసుకుని ఇంటి నుంచి వచ్చింది. కొళాయి వద్ద  బిందె ఉంచి.. ప్రేమికుడితో ఉడాయించింది. కుటుంబ సభ్యులు మూడు రోజులు వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా అదే నెల 30న ఎట్టకేలకు ఆ జంటను పోలీసులు అదుపులోకి తీసుకుని.. తల్లిదండ్రులకు అప్పగించారు.  

పోలీసు కౌన్సిలింగ్‌ తీరు...

  • ఇంట్లో నుంచి తీసుకెళ్లిన సొమ్ము అయిపోయిన తర్వాత పరిస్థితి ఆలోచించాలి.  
  • అసాంఘిక శక్తుల చేతికి చిక్కితే పరిస్థితి ఏంటి? 
  • ఇష్టాయిష్టాలను తల్లిదండ్రులకు తెలియజేస్తే మంచిది.
  • ఇష్టం లేని వివాహాలు, చదువులు, ఆశించిన ర్యాంకు రాదనే కారణాలు సహేతుకం కాదు. 
  • ఇంటి నుంచి వెళ్లిపోయిన వారిని బంధువులు, సమాజం చులకనగా చూస్తుంది.  
  • మొదట్లో బాగున్నా తర్వాత సంసారాల్లో కలహాలు మొదలవుతాయి. 
  • ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.  
  • టీనేజీ అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారు చేసే పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దేలా చూడాలి.  

(చదవండి: అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement