రూ.200 కోట్లు కొట్టేశారు | Priyanka Finance Filed An IP In City Civil Court, More Details Inside | Sakshi
Sakshi News home page

రూ.200 కోట్లు కొట్టేశారు

Published Tue, May 21 2024 8:41 AM

Priyanka Finance filed an IP in City Civil Court

సిటీ సివిల్‌ కోర్టులో ఐపీ దాఖలు చేసిన ప్రియాంక ఫైనాన్స్‌ 

అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయల సేకరణ

500 మందికి పైగా బాధితులు

పక్కాగా ప్లాన్‌ చేసిన టీఎస్‌సీబీ మేనేజర్‌

భర్త, కుమారుడితో అబిడ్స్‌ బ్యాంక్‌ సమీపంలోనే ఫైనాన్స్‌ సంస్థ ఏర్పాటు

 సీసీఎస్‌లో కేసు నమోదు, దర్యాప్తు బాధ్యతలు సిట్‌కు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు (టీఎస్‌సీబీ) మేనేజర్‌ భర్త, కుమారుడు కలిసి ఏర్పాటు చేసిన ప్రియాంక ఫైనాన్స్‌ సంస్థ రూ.200 కోట్లు మేర స్వాహా చేసి బిచాణా ఎత్తేసింది. అధిక వడ్డీ పేరుతో అనేక మంది నుంచి డిపాజిట్లు సేకరించి ఐపీ పిటిషన్‌ దాఖలు చేసింది. బాధితుల ఫిర్యాదుతో సోమ వారం కేసు నమోదు చేసుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు దర్యాప్తు బాధ్యతల్ని సిట్‌కు అప్పగించారు. సోమవారం సీసీఎస్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాకు చెందిన నిమ్మగడ్డ వాణి బాల, నేతాజీ భార్యాభర్తలు. సైదాబాద్‌లో వీళ్లు నివసిస్తుండగా... వాణి బాల ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లో విధుల్లో చేరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది టీఎస్‌సీబీగా మారగా ప్రస్తుతం వాణి బాల మేనేజర్‌ స్థాయిలో పని చేస్తున్నారు. 

15 శాతం వడ్డీ ఇస్తామని చెప్పి..  
దాదాపు 20 ఏళ్ల నుంచి వాణి బాల ఓ పథకం ప్రకారం బ్యాంక్‌కు వచ్చే వినియోగదారులను ఆకర్షిస్తూ వచ్చారు. టీఎస్‌సీబీలో డిపాజిట్‌ చేస్తే సాలీనా కేవలం 6 నుంచి 7% మాత్రమే వడ్డీ వస్తుందని, అబిడ్స్‌లోని టీఎస్‌సీబీ సమీపంలోనే తన భర్త నేతాజీ నెలకొలి్పన ఫైనాన్స్‌ సంస్థ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్‌లో డిపాజిట్‌ చేస్తే 15శాతం వడ్డీ వస్తుందని నమ్మబలికారు. బ్యాంకు కస్టమర్లతో పాటు సహోద్యోగులు, స్నేహితులను ఇందులో డిపాజిట్‌ చేసేలా ప్రేరేపించారు. చాలాకాలం చెల్లింపులు సక్రమంగా జరగడంతో అనేక మంది దృష్టి ఈ ప్రైవేట్‌ సంస్థపై పడింది.

బ్యాంకులో భారీ మొత్తం డిపాజిట్‌ చేస్తే ప్రతి ఏడాదీ ఐటీ శాఖ వారికి లెక్కలు చూపాలని, తమ సంస్థలో ఆ ఇబ్బంది ఉండదంటూ మరికొందరిని ఆకర్షించారు. డిపాజిట్లుగా సేకరించిన మొత్తంతో ఏం చేస్తున్నారంటూ ఇటీవల కొందరు ప్రియాంక సంస్థ నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి నిర్వాహకులు తమకు జీడిమెట్ల, బెంగళూర్‌లో వ్యాపారాలు, కర్మాగారాలు ఉన్నాయంటూ చెప్పి నమ్మిస్తూ వచ్చారు. దీంతో వీరి వద్ద డిపాజిట్లు పెరిగాయి. గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్‌ చేసిన వాళ్లూ ఉన్నారు. కాగా, ఆ ఫైనాన్స్‌ సంస్థలో ఆమె కుమారుడు శ్రీహర్ష కీలకంగా వ్యవహరించాడు. 

ఆఫీసు, ఇంటికి తాళాలు: ఈ నెల 14న ఆఖరుసారిగా కార్యాలయం తెరిచిన నేతాజీ ఆయన కుమారుడు శ్రీహర్ష సిబ్బందిని హఠాత్తుగా పంపేసి తాళం వేశారు. ఈ విషయం తెలిసిన బాధితులు సైదాబాద్‌లోని ఇంటికి వెళ్లగా అక్కడా తాళమే కనిపించింది. దీంతో తాము మోసపోయామని భావించి అబిడ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంతో ముడిపడిన కుంభకోణం కావడంతో సీసీఎస్‌కు వెళ్లాల్సిందిగా అక్కడి అధికారులు సూచించారు. దీంతో వాళ్లు సోమవారం సీసీఎస్‌ డీసీపీ ఎన్‌.శ్వేతను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితుల్లో అనేక మంది వృద్ధులు ఉన్నారని, వీళ్లంతా తమ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కూడా ప్రియాంక సంస్థలో పెట్టుబడిగా పెట్టారని అధికారులు చెప్తున్నారు.  

ఆర్నెల్లుగా వడ్డీల చెల్లింపుల్లో జాప్యం 
గతేడాది నవంబర్, డిసెంబర్‌ నుంచి వడ్డీల చెల్లింపులు సక్రమంగా జరగట్లేదు. అదేమని కొందరు ప్రశ్నించగా... ఎన్నికల సమయం కావడంతో డబ్బుల లావాదేవీలు తగ్గాయని అందుకే వడ్డీలు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందంటూ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరుకు వాణి బాల సరీ్వసు పూర్తి కావస్తుండటంతో పదవీ విరమణ పొందాల్సి ఉంది. దీంతో ఈ నెల 3న ప్రియాంక సంస్థ నిర్వాహకులు సిటీ సివిల్‌ కోర్టులో దివాలా పిటిషన్‌ (ఐపీ) దాఖలు చేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement