బోర్కర్‌..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది | Sakshi
Sakshi News home page

బోర్కర్‌..మామూలోడు కాదు!.. పెద్ద బ్యాగ్రౌండే ఉంది

Published Mon, Sep 5 2022 10:05 AM

Pritish Narayan Borkar Who Arrested By Hyderabad H NEW Police Is A Dangerous - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు గత నెలలో అరెస్టు చేసిన గోవా డ్రగ్‌ పెడ్లర్‌ ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌కు పెద్ద బ్యాగ్రౌండే ఉంది. గోవా పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన డ్రగ్‌ డీలర్‌ సదానంద్‌ చిముల్కర్‌కు సమీప బంధువు ఇతడు. భూయ్‌ అనే మారు పేరు కూడా ఉన్న చిముల్కర్‌ 2010–14 మధ్య గోవా సహా అనేక రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించాడు. ప్రీతీష్‌ను ఇటీవల తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారించగా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గోవాలోని అంజునా బీచ్‌ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఏళ్లుగా డ్రగ్స్‌ దందా చేస్తూ దాదాపు 600 మంది కస్టమర్లు కలిగి ఉన్న ఘరానా పెడ్లర్‌ ప్రీతీష్‌ నారాయణ్‌ బోర్కర్‌ను హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) గత నెల 17న పట్టుకుంది. ఇతడికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న స్టీవెన్, ఎడ్విన్‌ నూనిస్‌లకు బీజేపీ నేత, టిక్‌టాక్‌ స్టార్‌ సొనాలీ ఫోగాట్‌ హత్య కేసుతోనూ సంబంధాలు బయటపడ్డాయి. 

అంజునా ప్రాంతానికి చెందిన డ్రగ్స్‌ డాన్‌ సదానంద్‌ అలియాస్‌ భుయ్‌ చిముల్కర్‌కు ప్రీతీష్‌ బోర్కర్‌ సమీప బంధువు. సదానంద్‌ జీవశైలి, సంపాదన, డబ్బు ఖర్చు చేసే విధానం..ఇవన్నీ చూసిన ప్రీతీష్‌ తానూ డ్రగ్స్‌ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. సదానంద్‌కు సరఫరా చేసే వారి నుంచే ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, ఎక్స్‌టసీ, కొకైన్‌ తదితర మాదకద్రవ్యాలు ఖరీదు చేసే అమ్మడం మొదలెట్టాడు.

సదానంద్‌ను గోవా యాంటీ నార్కోటిక్స్‌ సెల్‌ (ఏఎన్సీ) అధికారులు 2010 జనవరిలో అరెస్టు చేశారు. అప్పట్లో ఇతడి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన తర్వాత సదానంద్‌ అడ్డం తిరిగాడు. అసలు తాను డ్రగ్సే అమ్మలేదని, తన కారులో ఏఎన్సీ అధికారులే వాటిని పెట్టారని కోర్టులో పిటిషన్‌ వేశాడు. లంచం ఇవ్వనందుకే ఇలా చేశారంటూ ఆరోపించాడు.

అయితే పోలీసులు చూపించిన ఆధారాలతో ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో గోవా పోలీసులు సదానంద్‌ను కట్టడి చేయడానికి ఆర్థిక మూలాలపై దృష్టి పెట్టారు. గోవా పోలీసు చరిత్రలో తొలిసారిగా డ్రగ్స్‌ కేసులో నిందితుడి ఆస్తులు, బంగారం, ఇన్సూరెన్స్‌ పాలసీలు, బ్యాంకు ఖాతాల్లోని నగదును జప్తు చేశారు. దీనికి తోడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు (ఈడీ) లేఖ రాశారు. దీంతో ఆ అధికారులు సదానంద్‌పై 2014లో మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

ఇలా డ్రగ్స్‌ డాన్‌పై ఈడీ కేసు నమోదు కావడం కూడా గోవాలో అదే తొలిసారి. ఈ పరిణామాలతో కంగుతిన్న ప్రీతీష్‌ బోర్కర్‌ తన ఉనికి బయటపడకుండా దందా చేయడం ప్రారంభించాడు. ప్రధానంగా సింథటిక్‌ డ్రగ్స్‌ అయిన ఎక్స్‌టసీ పిల్స్, ఎల్‌ఎస్‌డీ బోల్ట్సŠ, ఎండీఎంఏ మాత్రమే అమ్మేవాడు. అప్పుడప్పుడు మాత్రం చెరస్‌ను సరఫరా చేస్తుండేవాడు.

అయితే ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న గోవా పోలీసులు 2014 నవంబర్‌లో అక్కడి సియోలిమ్‌ వద్ద పట్టుకుని జైలుకు పంపారు. అప్పట్లో ఓ కస్టమర్‌కు నేరుగా డ్రగ్స్‌ డెలివరీ చేయడానికి వెళ్లిన ప్రీతీష్‌ పట్టుబడ్డాడు. దీంతో అప్పటి నుంచి ఇతగాడు తన పంథా మార్చాడు. ఎవరికీ కనిపించకుండా, కొరియర్స్‌ ద్వారానే డ్రగ్స్‌ సరఫరా చేపట్టాడు. ఇన్నాళ్లకు మళ్లీ హబ్సిగూడకు చెందిన కస్టమర్ల కోరిక మేరకు వారికి డ్రగ్స్‌ సరఫరా చేయడానికి గత నెల్లో హైదరాబాద్‌కు వచ్చి హెచ్‌–న్యూకు చిక్కాడు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement