మహిళ హత్య.. సోషల్‌ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాలు

Police Solve Woman Assassination Case In YSR Kadapa - Sakshi

మైనర్లే నిందితులు 

మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు  

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ వెల్లడి  

సాక్షి, కడప అర్బన్‌: మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిందితులను మైనర్లుగా గుర్తించారు. నిందితులను కడప బాలుర గృహంలోని పర్యవేక్షక గృహానికి పంపించారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ శనివారం విలేకరులకు వెల్లడించారు. ఈనెల 7న లింగాల పోలీసులకు పెద్దకుడాల సమీపంలోని గుట్టలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. గ్రామంలో వారు విచారించగా ఈ మృతదేహం అదే గ్రామానికి చెందిన నాగమ్మ(45)దిగా గుర్తించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీంద్రనాథ్‌రెడ్డి స్వీయపర్యవేక్షణలో మరుసటి రోజునే మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ హత్యకు గురైనట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక వచ్చింది. అప్పటికే హత్య కేసుగా నమోదు చేశారు. చదవండి: (సంచలనం రేపిన స్వాతి హత్య.. అసలేం జరిగింది..?)

ఈ హత్య చేసింది ఇద్దరు మైనర్లు అని తేలింది. వీరిలో ఒకరి వయసు 15, మరొకరికి 18 లోపు ఉంటుంది. వీరిద్దరే కాకుండా ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మహిళ ఎలాంటి అత్యాచారానికి గురి కాలేదని పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా తేలింది. పెద్దకుడాల గ్రామానికి చెందిన నాగమ్మకు 20 ఏళ్ల కిందట వేంపల్లి మండలం బక్కన్నగారిపల్లికి చెందిన వ్యక్తితో వివాçహమైంది. రెండు నెలలు మాత్రమే కాపురం చేసి పుట్టింటికి వచ్చేసింది. మూడు నెలల తరువాత సింహాద్రిపురం మండలం బిదినంచెర్లకు చెందిన వ్యక్తితో వివాహం కాగా తొమ్మిదేళ్ల తరువాత తల్లిదండ్రుల దగ్గరికే వచ్చేసింది. మేకలు మేపుకుంటూ, కొనుగోలు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఆమె తల్లి పుల్లమ్మ ఈనెల 7వ తేదీ రాత్రి 9 గంటలకు లింగాల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన రెండో కుమార్తె నాగమ్మ  అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిరోజూ ఉదయం 9:30కి మేకలను తీసుకెళ్లి మేపుకుని సాయంత్రం 5:30 కల్లా ఇంటికి వచ్చేస్తుందని, కానీ ఆరోజు రాకపోవడంతో తన కుమార్తెకు ఫోన్‌ చేయగా సమాధానం రాలేదని పేర్కొంది.  గ్రామస్తులతో గుట్ట వద్దకు వెళ్లగా తన కుమార్తె తలకు రక్తగాయమై చనిపోయి ఉందని బాధ్యులైన వారిని శిక్షించాలని ఫిర్యాదులో తెలిపింది. పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లలో ఒకరు తనను పెళ్లి చేసుకుంటావా? అని నాగమ్మను అడగ్గా చేసుకుంటానని సరదాగా చెప్పింది. చదవండి: (పెళ్లింట విషాదం.. భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం)

మరుసటి రోజు వారు నాగమ్మ కంటే ముందే గుట్టకు చేరుకున్నారు. ఆమె రాగానే వీరిలో ఒకరు ఆమెపట్ల అనుచితంగా ప్రవర్తించాడు. అతడిని ఆమె వెనక్కి తోసే ప్రయత్నంలో తానే పడిపోయింది. భుజం ఎముక పక్కకి జరిగింది. బాధ తట్టుకోలేక కేకలు పెట్టింది. దీంతో భయపడిపోయిన నిందితులు నాగమ్మను రాళ్లతో కొట్టి చంపేశారు. తరువాత పారిపోయారు. పోలీసుల విచారణలో వీరి పాత్రను తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారని ఎస్పీ విలేకరులకు వివరించారు.

అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ  
ఈ హత్య సంఘటనపై కొందరు అసత్యప్రచారాలను చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ హెచ్చరించారు. అనవసరంగా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేసినా, అబద్ధాలు ప్రచారం చేసినా ఊరుకునేది లేదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనవసరంగా తప్పుడు సమాచారంతో ప్రజల్లో ఆందోళన కలిగించవద్దని ఆయన సూచించారు.  

టీడీపీ శ్రేణుల రాద్ధాంతం 
ట్విట్టర్‌లో అసత్య ప్రచారాలు  
సాక్షి, కడప అర్బన్‌: లింగాల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన నాగమ్మ హత్య కేసును రాజకీయం చేసేందుకు టీడీపీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేశారనే విమర్శలు వినవస్తున్నాయి. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించడమే గాక, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా తప్పుడు సమాచారం చేరవేశారు. దీని ఆధారంగా చంద్రబాబు డీజీపీకి లేఖ రాయడం, ఆయన తనయుడు లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వాన్ని, పోలీసులను, విచారణను తప్పుపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటనను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. దీంతో టీడీపీ నేతల విమర్శల వెనుక ఉన్న దురుద్దేశం తేటతెల్లమైందని పలువురు పేర్కొంటున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై  చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top