విస్తృత తనిఖీలు.. 150 కేసులు 

Police Seized 4 Quintals Of Marijuana - Sakshi

4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం 

పలుచోట్ల పంట ధ్వంసం, నిందితులపై పీడీ యాక్ట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గంజాయి వేట దూకుడుగా సాగుతోంది. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు పోలీస్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లు, ఎక్సైజ్‌ ఠాణా పరిధిలో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నాయి. భారీస్థాయిలో కేసులు నమోదు చేస్తున్నాయి. గంజాయి సాగు చేస్తున్న వారితోపాటు సరఫరా చేస్తున్న వారినీ అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెడుతున్నాయి. ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ సమీక్ష తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు క్వింటాళ్లకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. 

ప్రత్యేక బృందాల సోదాలు 
ప్రతీ జిల్లా సరిహద్దుల్లో పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు తనిఖీలు ముమ్మరం చేశాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనూ నిఘా పెంచి గంజాయి స్మగ్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లోని అన్ని జోన్ల డీసీపీల పరిధిలో ప్రతీ రోజు 4 నుంచి 6 గంజాయి కేసులు నమోదవుతున్నాయి. ఒక్కో కేసులో 2 కేజీలకుపైగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ వారం రోజుల్లో ఒక్క హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే గంజాయి, డ్రగ్స్‌కు సంబంధించి 38 కేసులు నమోదు చేసినట్టు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు.

క్వింటాల్‌కుపైగా గంజాయిని హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. అదేవిధంగా సైబరాబాద్, రాచకొండ కమిషరేట్లలోనూ వేట కొనసాగుతోంది. సైబరాబాద్‌లో క్రైమ్స్‌ విభా గం డీసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి సోదాలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసి 11 కేజీల గంజా యి స్వాధీనం చేసుకుని, 17 మందిని అరెస్ట్‌ చేసినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. అదేవిధంగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సీపీ మహేష్‌ భగవత్‌ నేతృత్వంలో తనిఖీలు చేసి 38 కేసులు నమోదు చేశా రు. గంజాయి సిగరెట్లు విక్రయిస్తున్న పాన్‌షాపులపైనా దృష్టి పెట్టి 13 మందిపై కేసులు పెట్టారు. 

జిల్లాల్లోనూ ముమ్మరంగా... 
గంజాయి కట్టడికి వరంగల్, కరీంనగర్, ఖమ్మం కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, తెలంగాణకు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అదేవిధంగా కరీంనగర్‌లోని హుజూరాబాద్‌ ఎన్నికల సందర్భంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకు 11.6 కేజీల గంజాయి పట్టుబడటం సంచలనం రేపింది.

పోలీసులంతా ఎన్నికల బందోబస్తు, నేతల ప్రచారం, భద్రత వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో గంజాయి స్మగ్లర్లు ఇదే అదనుగా భావించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సీపీ సత్యనారాయణ అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో విస్తృతమైన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, మంథనిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అలాగే, వరుసగా గంజాయి కేసుల్లో పట్టుబడుతున్న నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్‌ అమలుచేస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 31 మందిపై, సైబరాబాద్‌లో ఆరుగురు, రాచకొండలో 8 మంది, నల్లగొండలో ఐదుగురు, ఖమ్మం, భద్రాచలం పోలీస్‌యూనిట్లలో 9 మందిపై పీడీ యాక్ట్‌ నమోదుచేశారు.  

గంజాయి సాగుపై నజర్‌ 
కొత్తగూడెం, రామగుండం కమిషనరేట్, ఆసిఫాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సైబరాబాద్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ, వికారాబాద్‌ జిల్లాల్లో గంజాయి సాగుపై ఇటు పోలీస్, అటు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాయి. అంతర్‌పంట పేరుతో గంజాయి సాగు చేస్తున్న వారిని గుర్తించి, పంటలను ధ్వంసం చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలంలోని జాఫర్‌పల్లిలో, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌ పరిధిలోని కడ్తాల్‌లోనూ గంజాయి పంటను ఎక్సైజ్‌ అధికారులు «ధ్వంసం చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top