దడ పుట్టిస్తున్న ధార్‌ గ్యాంగ్‌

Police Identified Massive Theft At Bashirabad As The work Of Dhar Gang - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేట్‌ బషీరాబాద్‌ పీఎస్‌ పరిధిలో మంగళవారం జరిగిన భారీ చోరీ మధ్యప్రదేశ్‌లోని ధార్‌ ముఠా పనిగా సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఒకేసారి నాలుగైదు ఇళ్లలో చోరీలకు పాల్పడటం ఈ గ్యాంగ్‌ స్టయిల్‌. దూలపల్లి హైటెన్షన్‌ లైన్‌లోని మహాలక్ష్మి ఎన్‌క్లేవ్‌ అగ్రి నివాస్‌లో అశోక్‌ రామ ఇంటితో పాటు అదే అపార్ట్‌మెంట్‌లోని 108, 203, 202 ఫ్లాట్లలోనూ దుండగులు చోరీకి యత్నించారు.

ఈ క్లూ ఆధారంగానే ఈ చోరీ ధార్‌ గ్యాంగ్‌ పనేనని పోలీసులు నిర్ధారించారు. తెలంగాణలో 2018 నుంచి చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాపై 98 కేసులుండగా.. వీటిలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 68 ఉండటం గమనార్హం. నెల రోజుల క్రితం ఈ గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు మాన్‌సింగ్‌తో పాటు మొహబత్, రీమ్‌ సింగ్, కిషన్‌సింగ్‌లను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

నలుగురు నిందితుల గుర్తింపు.. 
అగ్రి నివాస్‌ అపార్ట్‌మెంట్‌లో సీసీటీవీ కెమెరాలు లేకపోవటంతో.. ఆ రహదారిలోని సీసీటీవీ ఫుటేజీలను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్‌కు వెళ్లే దారిలోని రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

చోరీ జరిగిన ఇంట్లోని వేలిముద్రలు, ఇతరత్రా సాంకేతిక ఆధారాల మేరకు నలుగురు నిందితులు చోరీకి పాల్పడినట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. చోరీ సొత్తుతో నిందితులు రాష్ట్రం దాటకుండా ముమ్మర గాలింపు చేస్తున్నామన్నారు. ఐటీ, సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌), లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

(చదవండి: ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top