సినిమాను తలపించే ట్రైన్‌ ఛేజింగ్‌! రైల్వే పోలీసుల సాయంతో..

Police Arrests Thieves Over Train Chase In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: ఇప్పటి వరకు దొంగల వేటలో బైక్, కారు ఛేజింగ్‌లు చేసిన తమిళ పోలీసులు.. తాజాగా ట్రైన్‌ ఛేజింగ్‌తో ఉత్తరాది ముఠా ఆటకట్టించారు. వివరాలు.. తిరుప్పూర్‌కు యూనియన్‌ మిల్‌రోడ్డు కేపీఎన్‌ కాలనీకి చెందిన జయకుమార్‌ అదే ప్రాంతంలో కుదువ దుకాణం నడుపుతున్నాడు. ఈనెల మూడో(గురువారం) తేదీ అర్ధరాత్రి ఆ దుకాణంలో దోపిడీ జరిగింది. నాలుగో తేది ఉదయాన్నే(శుక్రవారం) ఈ ఘటన వెలుగు చూసింది.

ఈ దోపిడిలో 3 కేజీల బంగారం, 9 కేజీల వెండి, రూ. 25 లక్షల నగదును దుండగులు అపహరించుకెళ్లారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా దొంగల కోసం వేట మొదలెట్టారు. నలుగురు యువకులు ఈ దోపిడీకి పాల్పడినట్టు తేలింది. తిరుప్పూర్‌ నుంచి ఈ యువకులు చెన్నైకు చేరుకున్నట్లు గుర్తించారు. చివరికి చెన్నై నుంచి ముంబై వైపుగా వెళ్లే రైలు ఎక్కినట్టు తేలింది.  

సీసీ ఫుటేజ్‌ ఆధారంగా.. 
సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా మరో రైలులో తమిళ పోలీసులు ఛేజింగ్‌కు బయలుదేరారు. రైల్వే పోలీసుల సాయంతో ఆదివారం ఉదయాన్నే ఆ నలుగురు యువకులను చాకచక్యంగా నాగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దోపిడీకి పాల్పడింది తామేనని అంగీకరించారు.

వారి వద్ద నుంచి 3 కేజీల బంగారం, 9 కేజీల వెండి, రూ. 14 లక్షల నగదు లభించాయి. 24 గంటల్లో 11 లక్షలు మాయం చేసి ఉండడంతో, వీరికి సహకరించిన వారెవ్వరైనా తిరుప్పూర్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. బిహార్‌కు చెందిన ఈ నలుగురిని సోమవారం నాగ్‌పూర్‌ కోర్టులో హాజరు పరిచిన అనంతరం     తిరుప్పూర్‌కు తరలించనున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top