ఘరానా మహిళ.. వలవేసి దోచేసింది

Police Arrest Women For Blackmail Mans In Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు : మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో శోధించి ధనవంతులైన వ్యక్తులను వలలో వేసుకుని సన్నిహిత చిత్రాలను రికార్డు చేసి హనీట్రాప్‌కి పాల్పడుతున్న ఘరానా మహిళ కటకటాలు లెక్కిస్తోంది. ఒకప్పుడు ఆమె అందరికీ విద్యాబుద్ధులు చెప్పే ప్రభుత్వ టీచర్‌ కావడం గమనార్హం. ఇందిరానగర పోలీసుల కథనం ప్రకారం.. దేవయ్య పార్కు, రామమోహన్‌పురం 1వ క్రాస్‌కు చెందిన కవిత (38) నిందితురాలు. ఆమె గతంలో చిక్కమగళూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో ప్రధానోధ్యాయునితో గొడవ పడి దాడి చేయటంతో లింగదహళ్ళి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తరువాత కవిత విధులకు రాకపోవడంతో  సస్పెండయ్యారు.

మనీ కోసం మోసాలబాట
ఆ తరువాత ఆదాయం కోసం ఆన్‌లైన్‌ మోసాలపై దృష్టి సారించారు. మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో సంపన్నులైన వ్యక్తుల వివరాలను సేకరించి పరిచయాలు చేసుకునేది. డిసెంబర్‌ 21న జీవన్‌సాథి వెబ్‌సైట్‌ ద్వారా బెంగళూరు ఇందిరానగర కు చెందిన ప్రేమ్‌ డేనియల్‌ అనే వ్యక్తిని పరిచయం చేసుకొన్నారు. డిసెంబర్‌ 26న రాత్రి 9.30 గంటల డేనియల్‌ ఇంటికి వెళ్లారు. సన్నిహితంగా ఉంటూ అర్ధరాత్రి సమయంలో నీ బంగారు గొలుసు, డబ్బు ఇవ్వాలని కవిత పట్టుబట్టింది. అతడు ససేమిరా అనడంతో ఇందిరానగర పోలీస్‌ స్టేషన్‌లో డేనియల్‌లపై అత్యాచారం ఫిర్యాదు చేసింది.

ఇలా బట్టబయలైంది 
కేసు నమోదు చేసుకొన్న పోలీసులు డేనియేల్‌ను పిలిపించగా, పోలీసుల ముందు ఆ రోజు జరిగిన సంఘటనను ల్యాప్‌టాప్‌ ద్వారా రికార్డ్‌ చేసినదానిని చూపించాడు. ఆమె తనను రూ.5 లక్షలు ఇస్తే కేసు పెట్టనని బెదిరించిందని, తాను రూ.2 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు చెప్పాడు. ఆమె బ్లాక్‌మెయిల్‌ చేసిందని అతడు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నిందితురాలు కవితాను అరెస్ట్‌ చేసి తీవ్రంగా విచారించగా ఈమె ఇంతకుముందు మల్లేశ్వరం, మహాదేవపుర ప్రాంతాల్లో ఇలాగే పలువురిపై కేసులు నమోదు చేయించినట్లు తెలిసింది. ఈమె హనీట్రాప్‌ దందా ద్వారా ఎంత మంది మోసపోయిందీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top