
పాఠశాల వద్ద తల్లిదండ్రుల నిరసన
తనపై ఫిర్యాదు చేశారన్న అక్కసుతో విద్యార్థినులపై కక్ష
క్లాసులకు రావొద్దంటూ హుకుం
తమ చదువు ఏమవుతుందోనని ఆందోళనలో విద్యార్థులు
రేణిగుంట: సభ్యసమాజం తలదించుకునేలా ఓ ఉపాధ్యాయుడు కీచక అవతారం ఎత్తిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆర్.మల్లవరం హైసూ్కల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఆర్.మల్లవరం హైసూ్కల్లో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవి ఇటీవల 10వ తరగతి విద్యార్థినులను పాఠాలు చెప్పే క్రమంలో వారి ప్రైవేటు భాగాలపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పారు.
తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి టీచర్ రవితో వాగ్వాదానికి దిగారు. హెచ్‌ఎం వెంకటరమణ కలుగజేసుకుని ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని సర్దిచెప్పి పంపారు. అయితే అప్పటి నుంచి తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థినులపై టీచర్ రవి కక్ష కట్టారు. తన క్లాసుకు రావద్దంటూ విద్యార్థినులను బయటకు పంపారు. దీంతో తమ చదువులు ఏమైపోతాయోనని భయాందోళన చెందుతున్నారు.
ఆయనపై చర్యలు తీసుకుని బదిలీ చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై టీచర్ రవి మాట్లాడుతూ.. విద్యార్థినుల ఆరోపణలను ఖండించారు. హైసూ్కల్ ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ వారం రోజుల కిందట ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను టీచర్ రవి తాకరాని చోట తాకినట్లు ఫిర్యాదు చేశారని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవని సర్ది చెప్పి పంపించానన్నారు.