ఆన్‌లైన్‌ మోసం.. పోలీసులకే టోకరా.. 

Online Fraud In Name Of Traffic SI - Sakshi

వెలుగులోకి వచ్చిన ఆన్‌లైన్‌ మోసం 

ట్రాఫిక్‌ ఎస్సై పేరుతో మెసెంజర్‌లో చాటింగ్‌ 

అత్యవసరమంటూ లక్షల్లో దోచేసిన సైబర్‌ నేరగాళ్లు 

విజయనగరం క్రైమ్‌: సైబర్‌ నేరగాళ్లు పోలీసుశాఖనూ వదిలి పెట్టడం లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని సెల్‌కే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఫ్రెండ్స్‌ నుంచి వచ్చిన మెసెజ్‌లకు కనీసం వారికి ఫోన్‌ చేయకుండా ఏం ఇబ్బందుల్లో ఉన్నాడో అనుకుంటూ కేవలం చాటింగ్‌ మాత్రమే చేస్తూ డబ్బులు పంపించేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు చివరికీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన వారిని కూడా వదల్లేదు.  దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఆపదంటే ఆదుకునే మనసున్న వాళ్లు చాలామంది ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైబర్‌ నేరగాళ్లు కొత్తరకం పంథా మొదలెట్టేశారు. ఫేస్‌బుక్‌లో  పోలీసులు, లాయర్లు, వైద్యుల పేర్లతో కొత్తగా పేజీలు సృష్టించడం.. అందులో ఉన్న వారికి ఫ్రెండ్స్‌ రిక్వెస్టులు పెట్టడం.. వారు యాక్సెప్ట్‌ చేసిన తర్వాత వారికి మెసెంజర్‌ ద్వారా అత్యవసరమంటూ రెండు, మూడు వేల రూపాయల సాయం చేయమనడం జరుగుతోంది. దీంతో చాలా మంది ఏదో అవసరం ఉంటుందులే అనుకుని పేటీమ్, ఫోన్‌పే ద్వారా పంపించేస్తున్నారు.

ఈ కోవలోనే చాలా మంది పోలీస్‌ అధికారులు కూడా బలయ్యారు. రూ. లక్షల్లో సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. తాజాగా ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న ఎస్సై హరి  పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా ప్రారంభించారు. అతని మిత్రులందరినీ నకిలీ ఖాతాలో యాడ్‌ చేసుకుని వారితో మెసెంజర్‌ ద్వారా చాట్‌ చేశారు. అర్జెంట్‌ అవరం ఉందని.. గంటలో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానంటూ స్నేహితులకు మెసేజ్‌లు పంపించడంతో చాలా మంది ఫోన్‌పే, పేటీఎంల ద్వారా పంపించారు. అయితే ఫోన్‌ పేలో పేరు సరిగా లేకపోవడంతో ఒకరికి అనుమానం వచ్చి ఎస్సై హరికే నేరుగా ఫోన్‌ చేయడంతో ఆయన అవాక్కయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమందించి, ఆ ఖాతాను బ్లాక్‌ చేయించారు. ఎవ్వరూ డబ్బులు వేయవద్దని వాట్సాప్‌ ద్వారా మిత్రులందరికీ  మెసెజ్‌లు పెట్టారు. ప్రస్తుతం సైబర్‌ నేరగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top