బీమా ప్రీమియం పేరిట రూ.16.50 లక్షలు లూటీ!

Onilne Fraud: Chittoor Man Lost Rs.16.50 Lakhs - Sakshi

నాలుగేళ్లుగా డబ్బులు చెల్లిస్తూనే ఉన్న బాధితుడు

తీరా మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు

చిత్తూరులో వెలుగు చూసిన ఆన్‌లైన్‌ మోసం

సాక్షి, చిత్తూరు అర్బన్‌: ‘‘ హలో సర్‌! మీరు తీసుకున్న పాలసీల ప్రీమియం మధ్యలో ఆపేశారు. ఇప్పుడు ఓ రూ.60 వేలు కడితే మీకు రూ.3.20 లక్షలు వస్తాయి..’’ అని ఓసారి.. ‘‘మీరు చెల్లించిన రూ.60 వేలతో కలిపి మీ బీమా సొమ్ము రూ.7 లక్షలకు మెచ్యూర్‌ అయ్యింది. మరో రూ.30 వేలు కడితే జీఎస్టీ క్లియరెన్స్‌ అవుతుంది. మీకు మొత్తం నగదు ఇచ్చేస్తాం..’’ అంటూ మరోసారి.. ఇలా నాలుగేళ్లుగా ఓ వ్యక్తిని మోసం చేస్తూ రూ.16.50 లక్షలు లూటీ చేశారు. బాధితుడు మంగళవారం చిత్తూరు టూ టౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల కథనం మేరకు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సందీప్‌ కిషోర్‌ దుర్గానగర్‌ కాలనీలో కాపురం ఉంటున్నాడు.  2013లో ఇతను ఓ ప్రైవేటు సంస్థ నుంచి అభయ్‌ (ఏటా రూ.10 వేల ప్రీమియం), పీఎన్‌బీ (ఏటా రూ.30 వేల ప్రీమియం) పాలసీలు తీసుకున్నాడు. రెండేళ్లపాటు ప్రీమియం చెల్లించాడు. 2016లో ఇతనికి ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది.

తాను ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నట్లు దీపక్‌ పేరిట పరిచయం చేసుకున్నాడు. ప్రీమియం మధ్యలో చెల్లించి వదిలేయడం వల్ల ఆటో రెన్యువల్‌ అ య్యిందని, రూ.40 వేలు చెల్లిస్తే రూ.3.20 లక్షలు వస్తా య ని నమ్మించి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు కట్టించుకున్నాడు. తరువాత కూడా వేర్వేరు వ్యక్తులు ఆర్‌బీఐ నుంచి మాట్లాడుతున్నామంటూ సందీప్‌ నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే, నెఫ్ట్, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్స్, ఏటీఎంల ద్వారా 32 సార్లు లావాదేవీలు నిర్వహించి రూ.16.50 లక్షలు వసూలు చేశారు. చివరగా ఈనెల 17న సైతం రూ.48,360 చెల్లించా డు. చివరకు పాలసీ డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగేళ్లపాటు అతడు ఇలా మోసపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టూటౌన్‌ సీఐ యుగంధర్‌ కేసు నమోదు చేసి సైబర్‌క్రైమ్‌ విభాగానికి బదిలీ చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రేవ్‌ పార్టీ : విందులు, అమ్మాయిలతో చిందులు..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top