పోలీసునంటూ బెదిరింపులు...నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే జంటలే టార్గెట్‌

Old Criminal Targets Lonely Couples And Threats Like Police - Sakshi

సాక్షి, రాంగోపాల్‌పేట్‌: పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్‌ చేసి పోలీసునంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు సోమవారం వివరాలు వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు సృజన్‌ కుమార్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం మన్ననూర్‌లోని 4వ బెటాలియన్‌లో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 7న సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని బతుకమ్మ ఘాట్‌వద్ద ఓ జంట కారు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సృజన్‌కుమార్‌ తాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసు అధికారినంటూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారని వారిని బెదిరించాడు.

నకిలీ పోలీసు గుర్తింపు కార్డు చూపించి వెంటనే తనకు కొంత డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో కేసు పెడతానని బెదిరించాడు. అంతేగాక వారిని కారులో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–1 లోని కమల్‌ వాచ్‌ షోరూమ్‌కు తీసుకుని వెళ్లాడు. అక్కడ రూ.5800 విలువైన వాచ్‌ని కొనుగోలు చేసి బాధితులచే బిల్లు కట్టించాడు. అనంతరం వారిని  నేరుగా నెక్లెస్‌రోడ్‌కు తీసుకువచ్చి అక్కడ పార్కు చేసిన తన బైక్‌ తీసుకుని వెళ్లిపోయాడు.

దీనిపై బాధితులు రాంగోపాల్‌పేట్‌ పోలీసుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని రాంగోపాల్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు. నిందితుడి  నుంచి ఆపిల్‌ రిస్ట్‌ వాచ్, బీఫిట్‌ లింక్‌ బీకే వాచ్, ఆక్టివా వాహనం, రెండు ఆపిల్‌ ఫోన్లు, పోలీసు గుర్తింపు కార్డు, ఐపాడ్‌ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.  

నకిలీ పోలీస్‌ ఐడీ కార్డుతో బెదిరింపులు..
నిందితుడి తండ్రి ఎస్సైగా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. జల్సాలకు అలవాటు పడిన సృజన్‌ కుమార్‌ 10వ తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు.  2007 నుంచి మోసాలకు పాల్పడుతున్న ఇతడిపై  తెలంగాణాలో 14 కేసులు, ఏపీలో 4 కేసులు ఉన్నాయి. మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అతడిపై నాన్‌బెయిల్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉంది. ఏపీలో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లిన సృజన్‌కుమార్‌ ఇటీవలే జైలు నుంచి బయటికి వచ్చిడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డుతో, బైక్‌పై  పోలీస్‌ స్టిక్కర్‌తో తిరుగుతూ అమాయకులను బెదిరించి మోసాలకు పాల్పడుతున్నాడు. అంతేగాక అతను ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.   

(చదవండి: చాటింగ్‌ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top