డ్రగ్స్‌ ముఠాతో ఆర్యన్‌కు లింకు?

NCB hands over reply opposing bail plea of Aryan Khan - Sakshi

కోర్టుకి చెప్పిన ఎన్‌సీబీ

ముంబై: ముంబై తీరంలోని క్రూయిజ్‌ షిప్‌లో మాదక ద్రవ్యాల పట్టివేత కేసులో బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ బెయిల్‌పై ముంబైలోని స్పెషల్‌ కోర్టులో వాడిగా వేడిగా వాదనలు జరిగాయి. ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ వి.వి. పాటిల్‌ సమక్షంలో ఇరుపక్షాలు బుధవారం రోజంతా తమ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగిసిపోవడంతో విచారణను గురువారానికి జడ్జి వాయిదా వేశారు. ఆర్యన్‌ గత కొన్నేళ్లుగా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, పంపిణీ సైతం చేస్తాడని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) కోర్టుకి వెల్లడించింది. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాతో ఆర్యన్‌కి సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని, ఇక ఆర్యన్‌ విదేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించనున్నట్టు ఎన్‌సీబీ వెల్లడించింది.

ఆర్థిక అంశాలపై విచారణకు మరి కొంత సమయం పడుతుందని పేర్కొంది. ఎన్‌సీబీ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌ ఒక్క నిందితుడిని విడుదల చేసినా విచారణపై ప్రభావం చూపిస్తుందని వాదించారు. ఆర్యన్, సహనిందితుడు అర్బాజ్‌ వాట్సాప్‌ చాట్స్‌ని పరిశీలిస్తే విదేశస్తులకు భారీగా మాదక ద్రవ్యాలను పంపిణీ చేసిన విషయం వెల్లడవుతోందని వాదించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ వినియోగం పెరిగిపోయిందని, ముఖ్యంగా కళాశాల విద్యార్థులు మత్తుకు బానిసలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్యన్‌ తరఫున హాజరైన అమిత్‌ దేశాయ్‌ ఎన్‌సీబీ చేసిన వాదనలు అర్థరహితమని కొట్టిపారేశారు. నిందితులు డ్రగ్స్‌ విక్రేతలు కాదని వాదించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top