Hyderabad Crime: భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్‌ కథా చిత్రమ్‌

Mystery Unraveled In The Abdullapurmet Assassination Case Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్/అబ్దుల్లాపూర్‌మెట్‌: నగరంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ జంట హత్యల కేసును పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. జ్యోతి ప్రవర్తనతో విసిగివేసారిన ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేల్చారు.  హత్య చేసిన అనంతరం విజయవాడకు పారిపోయిన నిందితుడు శ్రీనివాసరావును రాచకొండ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరంలో మరెవరికీ ప్రమేయం లేదంటూ అతడు చెబుతున్నా... అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి దర్యాప్తు అధికారులు సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. గురువారం అధికారికంగా నిందితుడి అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది.  

భార్య ప్రవర్తనతో విసుగుచెంది... 
వారాసిగూడ ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు, జ్యోతి (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమెకు ఏడాది క్రితం ఇదే ప్రాంతానికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ యడ్ల యశ్వంత్‌తో పరిచయమైంది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య పలుమార్లు వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తాను యశ్వంత్‌ను విడిచి ఉండలేనని, తనకు మీరిద్దరూ కావాలంటూ జ్యోతి చెప్పడంతో విసుగు చెందాడు. దీంతో ఇద్దరినీ హతమార్చాలని నిర్ణయించుకున్నాడు శ్రీనివాసరావు. 

అభ్యంతరం లేదంటూ నమ్మించి... 
వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్న శ్రీనివాసరావు ఆదివారం ఆ పని పూర్తి చేయాలని భావించాడు. దీనికి ముందే యశ్వంత్‌తో సంబంధం కొనసాగించడానికి తనకు అభ్యంతరం లేదంటూ భార్యతో చెప్పి ఆమెను నమ్మించాడు. ఆదివారం రాత్రి 7 గంటలకు జ్యోతితో యశ్వంత్‌కు ఫోన్‌ చేయించాడు. నగర శివార్లకు వెళ్దామంటూ చెప్పించడంతో యశ్వంత్‌ తన సోదరుడి వాహనం తీసుకుని వచ్చాడు. వారాసిగూడ నుంచి ముగ్గురూ రెండు బైక్‌లపై ఎల్బీనగర్‌ చేరుకున్నారు. అక్కడ జ్యోతికి శ్రీనివాస్‌ అనే వ్యక్తి కలిశాడు. ఆమెకు తన స్నేహితుడి ద్వారా శ్రీనివాస్‌తో అంతకుముందే పరిచయం ఉంది.  

బిల్లు చెల్లించి.. డబ్బులు బదిలీ చేసి.. 
ఎల్బీనగర్‌లోని ఓ పాదరక్షల దుకాణంలో జ్యోతి కొత్త చెప్పులు కొనుగోలు చేసింది. వీటి నిమిత్తం రూ.3 వేలు శ్రీనివాస్‌ చెల్లించాడు. అతడి ద్వారానే గూగుల్‌పే ద్వారా మరో రూ.5 వేలు తన భర్త శ్రీనివాసరావుకు బదిలీ చేయించింది. అక్కడి నుంచి శ్రీనివాస్‌ వెళ్లిపోగా.. జ్యోతి, శ్రీనివాసరావు, యశ్వంత్‌ బైక్‌లపై విజయవాడ జాతీయ రహదారి వైపు వెళ్లారు. ఈ దృశ్యాలు ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మార్గమధ్యలోని ఓ వైన్స్‌లో మద్యం, కూల్‌డ్రింక్స్‌ ఖరీదు చేశారు. రాత్రి మొత్తం శివార్లలోనే గడపాలనే ఉద్దేశంతో తమ వెంట ప్లాస్టిక్‌ చాప, ఎల్‌ఈడీ టార్చిలైట్, మూడు పవర్‌ బ్యాంక్స్‌ కూడా తీసుకువెళ్లారు. 

రాయితో కొట్టి.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి... 
వీరు ముగ్గురూ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కగా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడి పొదల్లో యశ్వంత్, శ్రీనివాసరావు మద్యం తాగా రు. ఆపై ఏకాంతంగా గడిపేందుకు జ్యోతి, యశ్వంత్‌ కొంచెం దూరం వెళ్లారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా శ్రీనివాసరావు వెనక నుంచి రాయితో దాడి చేశాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యశ్వంత్‌ను పక్కగా లాక్కెళ్లిన శ్రీనివాసరావు తన బైక్‌లో నుంచి స్క్రూడ్రైవర్‌ తీసి అతడి పొట్ట, గొంతుపై పొడిచా డు. మరో రాయితో అతడి మర్మాంగాన్ని ఛిద్రం చే సి, అక్కడ నుంచి విజయవాడకు పారిపోయాడు.

చెప్పుల దుకాణం రసీదు ఆధారంగా.. 
జంట హత్యల విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలో లభించిన జ్యోతి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న చెప్పుల దుకాణం బిల్లు ఆధారంగా శ్రీనివాస్‌ వివరాలు తెలుసుకుని  ఆ దిశగా విచారణ జరిపారు. అతడి ద్వారానే శ్రీనివాసరావు ఫోన్‌ నంబర్‌ తీసుకున్నారు. భార్య జ్యోతి ఆదివారం నుంచి కనిపించకపోయినా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయకపోవడంతో అతడిపై పోలీసులకు అనుమానం బలపడింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌లోనూ కొన్ని ఆధారాలు లభించాయి. అతడి సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా విజయవాడలో ఉన్నట్లు గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యల్లో మరెవరి ప్రమేయం లేదంటూ నిందితుడు చెబుతున్నాడు. మరికొంత సాంకేతిక దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు.   

(చదవండి: అబ్దుల్లాపూర్‌మెట్‌ హత్యలు: జ్యోతి కళ్ల ముందే యశ్వంత్‌ను చంపి, ఆపై..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top