భర్త వేధింపులతో విసిగి కూతురుసహా తల్లి సజీవదహనం 

Mother Daughter Were Burnt Alive Due To Husband Harassment In Siddipet - Sakshi

సిద్దిపేట జిల్లా జప్తిసింగాయిపల్లిలో ఘటన   

ములుగు(గజ్వేల్‌): కుటుంబకలహాలు రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. ఒకవైపు భర్త వేధింపులు.. మరోవైపు మానసిక వికలాంగురాలైన కూతురుకు పెళ్లి కాదేమోననే బెంగ.. కొంతకాలంగా మానసిక వేదన అనుభవిస్తున్న ఓ తల్లి కూతురుతోసహా నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు అవిలయ్యకు ఇద్దరు భార్యలు.

పెద్ద భార్య గంగవ్వ(40)కు జ్యోతి, హారతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకూతురు వివాహం జరగ్గా మానసిక వికలాంగురాలైన పెద్ద కూతురు జ్యోతి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. రెండో భార్యకు కొడుకు, కూతురు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆరునెలల నుంచి అవిలయ్య, గంగవ్వకు మధ్య కుటుంబకలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అవిలయ్య ఆమెను కొట్టడంతో గురువారం ఉదయం 10 గంటలకు తన సోదరుడు మానుక అవిలయ్యకు ఫోన్‌ చేసి చెప్పింది.

దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అతడు బావకు ఫోన్‌ చేయగా గంగవ్వ, జ్యోతి కనపడటం లేదని చెప్పాడు. ఆందోళనకు గురైన మానుక అవిలయ్య వారి కోసం వెతకడం ప్రారంభించాడు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు జప్తిసింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నీలగిరి చెట్ల మధ్య కాలినస్థితిలో గంగవ్వ, జ్యోతి మృతదేహాలు కనిపించాయి.

అక్కడ సమీపంలోనే గంగవ్వ బంగారు, వెండి అభరణాలు మూటకట్టి ఉన్నాయి. భర్త వేధింపులు భరించలేకనే తన సోదరి గంగవ్వ కూతురితో కలసి నిప్పంటించుకుని బలవన్మరణం చెందిందని మానుక అవిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. గంగవ్వ భర్త అవిలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top