విడిచి ఉండలేక.. విడివిడిగా ఆత్మహత్య!

Minor Lovers Commits Suicide In Peddapalli District - Sakshi

పెద్దపల్లి జిల్లాలో మైనర్‌ ప్రేమజంట అఘాయిత్యం

సుల్తానాబాద్‌రూరల్‌ (పెద్దపల్లి): వారిద్దరిదీ తెలిసీతెలియని వయసు. అయినా ఇద్దరూ ఇష్టపడ్డారు. ఆ అమ్మాయి, అబ్బాయిల కులాలు వేర్వేరు. పెద్దలు వారించడంతో కలసి ఉండలేమని భావించి ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. సుల్తానాబాద్‌ మండలం కనుకుల గ్రామానికి చెందిన సురువ్‌ రామస్వామి, శ్రీలత దంపతుల కుమారుడు శివ(18) తొమ్మిదో తరగతి, అదే గ్రామానికి చెందిన సిరిపురం కుమార్, పద్మ దంపతుల కూతురు సుస్మిత(17) పదోతరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటున్నారు.

కొద్దిరోజులుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారిని మందలించారు. పెళ్లిచేసుకునే వయస్సు కాదంటూ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. అయినా ఆ ప్రేమజంటలో మార్పు రాలేదు. ఆర్నెళ్ల క్రితం ఇద్దరూ కలసి హుజూరాబాద్‌లోని శివ అమ్మమ్మ ఇంటికి పారిపోయారు. శివ మేనమామ వారిద్దరినీ మందలించి సుస్మిత బంధువులకు సమాచారం ఇచ్చారు. హుజూరాబాద్‌ పోలీసుల సమక్షం నుంచి సుస్మితను ఆమె తల్లిదండ్రులు తమ గ్రామానికి తీసుకెళ్లారు.

చదవండి: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. మూడ్రోజులపాటు

అప్పటి నుంచి శివ హుజూరాబాద్‌లోనే ఉంటూ సుస్మితతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఈ నెల 12న శివ పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వరంగల్‌కు, అక్కడి నుంచి కరీంనగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అతడి మృతదేహానికి అదేరోజు సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు పూర్తిచేశారు.  అనంతరం సుస్మిత సోమవారంరాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. మంగళవారం వేకువజామున సమీప వ్యవసాయబావిలో శవమై తేలింది. 

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top