ముసుగు దొంగల స్వైరవిహారం... మూడు విల్లాల్లో చోరి | Sakshi
Sakshi News home page

ముసుగు దొంగల స్వైరవిహారం... మూడు విల్లాల్లో చోరి

Published Thu, Jul 21 2022 7:34 AM

Masked Robbers Rampage Theft In Three Villas - Sakshi

శంషాబాద్‌: శంషాబాద్‌ పట్టణం, సాతంరాయిలో ముసుగు దొంగలు స్వైరవిహారం చేశారు. గేటెడ్‌ కమ్యూనిటీ ప్రహరీపై ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి లోపలికి చొరబడి చోరీ చేసిన సంఘటన  కలకలం రేపింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాశంబండ సాతంరాయిలోని సుచిరిండియా విల్లాల్లో  బుధవారం ఉదయం మూడు విల్లాల యజమానులు ఇంటి తలుపులకు ఉన్న గడియలు కోసేసి ఉండటాన్ని గుర్తించారు.

అల్మారాల్లో ఉన్న నగదు పోయిందని నిర్ధారించుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్‌ ఏసీపీ భాస్కర్, సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. విల్లాలకు ముందు భాగంలో ఉన్న ఫెన్సింగ్‌ను కోసేసిన దుండగులు లోపలికి చొరబడి విల్లాల వెనుక భాగంలో ఉన్న తలుపులను గ్యాస్‌ కట్టర్లతో తొలగించినట్లు గుర్తించారు.  

ఐఏఎస్‌ అధికారి ఇంట్లో.. 
కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శ్రీనివాస్‌  ఇంట్లో  రూ. 60 వేలు, ఆ పక్కనే ఉన్న మరో రెండు విల్లాల్లో  రూ. 30, రూ. 10 వేలు దొంగిలించారు. అయితే  ఆయా ఇళ్లల్లో వెండి  వస్తువులు, పాటు విలువైన గ్యాడ్జెట్స్, ల్యాప్‌టాప్‌లు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం.  

తీరిగ్గా ఆకలి తీర్చుకుని.. 
ముసుగు దొంగలు ముగ్గురు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ పని ప్రారంభించి సుమారు నాలుగు గంటల వరకు అక్కడే ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో  స్పష్టమైంది. వారు రెండు ఇళ్లలోని ఫ్రిజ్‌లలో పండ్లను మొత్తం  ఆరగించినట్లు గుర్తించారు. చోరీల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విల్లాలపై స్పష్టమైన అవగాహన ఉన్న వారే దొంగతనం చేసి ఉంటారా..? అన్న దానిపై పోలీసులు  ఆరా తీస్తున్నారు.  

(చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ..)

Advertisement
Advertisement