తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం..

Man Impregnates Live in Partners Minor Daughter - Sakshi

సాక్షి, కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ప్రబుద్ధుడు కూతురు సమానురాలైన బాలికను తల్లిని చేశాడు. నెలలు నిండిన బాలిక ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరడంతో విషయం వెలుగుచూసింది. ఈ  ఘటనకు సంబంధించి దిశ డీఎస్పీ జి.రాజీవ్‌కుమార్‌ శనివారం చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పెయింటర్స్‌ కాలనీకి చెందిన కోమటి సురేష్‌రెడ్డి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఏడేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉండగా.. సురేష్‌రెడ్డి ఆ మహిళ కుమార్తెను కూడా లోబరుచుకున్నారు. ఏడాది కాలంగా లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఆరు నెలల తరువాత విషయం తెలుసు కున్న తల్లి పరువు పోతుందనే భయంతో అబార్షన్‌ చేయించేందుకు ప్రయత్నించింది. వైద్యులు నిరాకరించడంతో చేసేది లేక మిన్నకుండిపోయింది.

చదవండి👉  (తమదే అనుకుని వేరే బైకులో రూ. 2.80 లక్షలు ఉంచి.. చివరకు..)

అప్పటి నుంచి విషయం బయట పడకుండా జాగ్రత్తపడ్డారు. నెలలు నిండిన బాలికకు పురిటినొప్పులు రావటంతో ఏప్రిల్‌ 28వ తేదీ రాత్రి బందరు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వైద్య సిబ్బందికి సరైన సమాచారం ఇవ్వకపోవటంతో అనుమానం వచ్చిన సిబ్బంది అవుట్‌పోస్టు పోలీసులకు తెలిపారు. పోలీసుల విచారణలో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పింది.

మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడు సురేష్‌పై రేప్, పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇదిలా ఉండగా ప్రసవం నిమిత్తం ఆసుపత్రిలో చేరిన మైనర్‌ 29వ తేదీ రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆదేశాలతో విచారణ చేపట్టిన దిశ డీఎస్పీ రాజీవ్‌కుమార్‌ శనివారం నిందితుడిని అరెస్టు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top