చనువుగా ఫోటోలు, వీడియో కాల్స్‌.. కట్‌ చేస్తే..

Man Held Blockmailing Innocent Womens In Hyderabad - Sakshi

సాక్షి, పటాన్‌చెరు టౌన్‌: అమాయకులైన ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకొని వారి ఫోన్‌ నంబర్లు తీసుకొని పరిచయాలు పెంచుకున్నాడు ఓ యువకుడు. అనంతరం వారితో చనువుగా ఫోన్‌లో సెల్ఫీలు దిగుతూ మీ భర్తలకు పంపుతాను అని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. ఇలానే ఓ మహిళ దగ్గర నుంచి రూ.18 లక్షలు వసూలు చేసి బెదిరిస్తుండగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌ తరలించిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

సీఐ శ్రీనివాసులు రెడ్డి కథనం మేరకు.. అమీన్‌పూర్‌కు చెందిన ఎండీ అక్రమ్‌ బిన్‌ అహ్మద్‌ అలియాస్‌ అక్రం ఖాన్‌ (23) పాలిటెక్నిక్‌ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి అమాయాకులైన ఆడవారిని ఆసరాగా చేసుకొని ఫోన్‌ నంబర్లు తీసుకునేవాడు. వారితో పరిచయం పెంచుకొని ఫోన్‌లో చాట్‌ చేసి వీడియో కాల్స్‌ మాట్లాడుతూ లోబర్చుకునేవాడు. ఆపై తను చెప్పిన చోటుకు పిలిచి దగ్గరగా సెల్ఫీలు తీసుకునేవాడు. వారు వీడియో కాల్స్‌ మాట్లాడుతున్న సమయంలో స్క్రీన్‌ షాట్‌లు తీసి వాటిని తల్లిదండ్రులు, భర్తలకు పంపుతా అని బెదిరించసాగాడు.

చాలా మందితో ఇలానే ప్రవర్తించాడు. ఇలాగే ఓ మహిళతో పరిచయం పెంచుకొని లోబర్చుకున్నాడు. ఆపై భర్తకు చెబుతానని బెదిరించి ఆమె నుంచి రూ.18 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఇంకా బెదిరిస్తున్న క్రమంలో భరించలేని మహిళ శుక్రవారం అమీన్‌పూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే అక్రమ్‌ బిన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మహిళలు సోషల్‌ మీడియాలో అపరిచుతులతో మాట్లాడకూడదని, ఫొటోలు, ఫోన్‌ నంబర్లు పెట్టకూడదన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top