అనుమానం పెనుభూతమై.. భార్యను

Man Eliminated Wife Over Suspect Extramarital Affair Guntur District - Sakshi

మంటగలుస్తున్న పవిత్రబంధం

మూడు ముడులతో ఒక్కటై, ఏడు అడుగులతో ప్రారంభమై నూరేళ్ల ప్రయాణంలా సాగాల్సిన దాంపత్య బంధాన్ని అనుమానాలు, వివాహేతర సంబంధాలు అర్ధంతరంగా చిదిమేస్తున్నాయి. పిల్లాపాపలతో హాయిగా సాగాల్సిన నిండు జీవితాలను కడతేరుస్తున్నాయి. జీవిత భాగస్వామిని హత్య చేసేందుకు పురిగొలుపుతున్నాయి. అనుమానం పెనుభూతమైన ఓ భర్త తన అర్ధాంగిని కత్తితో నరికి చంపేశాడు.

పట్నంబజారు (గుంటూరు): అనుమానం పెనుభూతమై ఓ వ్యక్తి భార్యను వేధించాడు. ఈ వేధింపులు తాళలేక పుట్టింటికి చేరిన భార్యను కత్తితో నరికి హతమార్చాడు. గుంటూరు నగరంలో ఈ ఘటన శుక్రవారం జరిగింది. నగరంపాలెం పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ ఎ.మల్లికార్జునరావు కథనం మేరకు.. శ్రీనివాసరావుపేటలోని వేణుగోపాల్‌ నగర్‌కు చెందిన కోటా శిరీష (24)కు 2012లో పొన్నూరు సమీపంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన వెంకటతిరుపతిరావుతో వివాహమైంది. వారికి ఐదేళ్ల కుమారుడు లోకేష్‌ ఉన్నాడు.

కాగా పెళ్లయిన నాటి నుంచి శిరీషను తిరుపతిరావు అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. భర్త వేధింపులు తాళలేక శిరీష రెండేళ్ల క్రితం పుట్టింటికి వచ్చేసింది. భార్యాభర్తల మధ్య వివాదానికి సంబంధించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే తిరుపతిరావు అనేకసార్లు శిరీష పుట్టింకి కాపురానికి రావాలంటూ బెదిరించాడు. శిరీష తల్లి ఎలిశెట్టి ఈశ్వరిపైనా అతను దాడి చేయడంతో నగరంపాలెం పీఎస్‌లో కేసు నమోదయింది. శుక్రవారం ఉదయం కత్తిపెట్టుకుని శిరీష పుట్టింటికి వచ్చాడు.

అతడిని గమనించిన ఈశ్వరి తలుపులు వేసుకోవాలంటూ కేకలు వేసి శిరీషను హెచ్చరించింది. శిరీష పక్కంట్లోకి వెళ్లేంతలోనే తిరుపతిరావు ఆమెపై దాడి చేసి కత్తితో గొంతు భాగంతో నరికాడు. శిరీష ఘటనాస్థలంలోనే మృతి చెందింది. ఈశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

చదవండి: ప్రేమ వివాహం.. భార్యను దారుణంగా కొట్టి
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top