కూడు పెట్టిన వల.. కాటికి పంపింది

Man Demice Tragedy In Nirmal - Sakshi

సాక్షి, భైంసా(నిర్మల్‌): గోదావరి నదిలో చేపలు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తొందూర్‌ నాగేశ్‌(45) చేపల కోసం తాను కట్టిన వలకే ప్రమాదవశాత్తు చిక్కుకొని మృతి చెందిన సంఘటన బాసరలో శనివారం జరిగింది. ఎస్సై ప్రేమ్‌దీప్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తొందూర్‌ నాగేశ్‌ బాసర వద్ద నదిలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నది నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది.

దీంతో చేపలు లభిస్తాయన్న ఆశతో శుక్రవారం నదిలో చేపల కోసం వలవేశాడు. తిరిగి శనివారం చేపల కోసం నాటుపడవపై వెళ్లి తాను వేసిన వలలోనే అనుకోకుండా చిక్కుకున్నాడు. నీటిలో మునిగిపోతున్న నాగేశ్‌ను ఒడ్డుపై ఉన్న తోటి జాలర్లు గమనించి కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వారు నాగేశ్‌ ఉన్న చోటికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయాడు. 

ఎందరివో ప్రాణాలు కాపాడి..
తొందూర్‌ నాగేశ్‌ బాసర వాసులకు, ఆలయ అధికారులకు, గోదావరి నది వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి సుపరిచితుడే. బాసర ఆలయానికి వచ్చి వెళ్లేవారిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునగబోయే ఎంతో మంది భక్తులను నాగేశ్‌ కాపాడాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని గోదావరి నదిలో దూకిన పలువురిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చాడు. అలాంటిది నాగేశ్‌ చివరికి తానే వేసిన చేపల వలలో చిక్కి ప్రాణాలు వదిలాడు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఫోన్‌లో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.  

చదవండి: దారుణం: 16రోజులు... నాలుగు హత్యలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top