
రమణయ్య(ఫైల్)
ఉదయగిరి: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న కంభంపాటి రమణయ్య(40) శానిటైజర్ తాగడంతో అది వికటించి శనివారం రాత్రి మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు..ఉదయగిరిలోని చాలక వీధికి చెందిన రమణయ్య గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కరోనా నేపథ్యంలో ఉదయగిరిలో లాక్‌డౌన్ అమలు చేస్తూ వైన్‌షాపులు మూసివేయడంతో శనివారం రాత్రి శానిటైజర్ తాగి నిద్రకు ఉపక్రమించాడు. కొద్దిసేపటి తర్వాత కడుపులో నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అటెండర్ రమణయ్య మృతిపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.