హత్య కేసులో ప్రేమోన్మాదికి జీవిత ఖైదు..

Man Brutally Killed Innocent Girl In The Name Of Love In Warangal District - Sakshi

సాక్షి, వరంగల్‌ లీగల్‌: చిన్ననాటి నుండి కలిసి చదువుకుంటుండగా ఏర్పడిన స్నేహాన్ని ఆసరాగా చేసుకొని డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా నిరాకరించిన విద్యార్థినిపై పెట్రోల్‌ పోసి కాల్చిచంపిన ప్రేమోన్మాదికి జీవిత ఖైదు విధించారు. అలాగే, రూ.1.12లక్షల జరిమానా విధిస్తూ గురువారం వరంగల్‌ మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన తోపుచర్ల రవళి, వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన సాయి అన్వేష్‌ చిన్ననాటి నుంచి ఒకే పాఠశాలలో నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఇంటర్‌ చదివే సమయంలో కూడా తరచూ కలుసుకునేవారు. 2016లో డిగ్రీ వచ్చిన తర్వాత చిన్ననాటి నుండి ఉన్న పరిచయంతో నిన్ను ప్రేమిస్తున్నాను, పెండ్లి చేసుకుంటానని ఒత్తిడి చేయసాగాడు. దీనికి రవళి నిరాకరించడంతో సాయిఅన్వేష్‌ బెదిరించాడు. ఇదే క్రమంలో రవళి మరో యువకుడితో చనువుగా ఉంటుందని కోపం పెంచుకున్న ఆయన ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

హత్య చేయాలనే పథకంతో 2019 ఫిబ్రవరి 27న రవళి చదువుతున్న కాలేజీ సమీపంలో హన్మకొండ నయీంనగర్‌లోని హాస్టల్‌ వద్దకు సాయి అన్వేష్‌ వచ్చాడు. మాట్లాడే పని ఉందని చెప్పి, ముందస్తుగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ విద్యార్థిని రవళిపై పోసి నిప్పంటించాడు. బాధితురాలు రవళి చికిత్స పొందుతూ మృతి చెందింది. హత్యానేరం క్రింద కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు సాయి అన్వేష్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఐపీసీ సెక్షన్‌ 302 హత్యానేరం క్రింద జీవితఖైదుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద రూ.1.12లక్షలు జరిమానా విధిస్తూ జడ్జి శైలజ తీర్పు వెల్లడించారు. 

     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top