ప్రేమోన్మాది ఘాతుకం

Man Assassination Attack On Teenage Girl For Not Loving him - Sakshi

ప్రేమను ఒప్పుకోలేదని బాలిక గొంతు కోసిన వైనం

ప్రాణాపాయస్థితిలో తిరుపతి రుయా హాస్పిటల్‌లో చికిత్స 

హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు నమోదు

వెంకటగిరి/నెల్లూరు (క్రైం): తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ బాలిక గొంతుకోసిన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటుచేసుకుంది. వెంకటగిరి పట్టణం అమ్మవారిపేటకు చెందిన బాలిక జ్యోతి (17) స్థానికంగా ఉన్న విశ్వోదయ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాలేజీమిట్ట ప్రాంతానికి చెందిన రాయపాటి చెంచుకృష్ణ ఆమెను ప్రేమిస్తున్నానని, తనతో మాట్లాడాలని కొంతకాలంగా  వెంటపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు చెంచుకృష్ణను మందలించారు.

కక్షకట్టిన అతను సోమవారం బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన నిందితుడు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. బాలిక ఇంటికి సమీపంలోనే ఉన్న తన ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. పోలీసులు   నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ సీహెచ్‌ విజయారావు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, వెంకటగిరి ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసులరెడ్డి, వెంకటగిరి, బాలాయపల్లి ఎస్‌ఐలు కోటిరెడ్డి, జిలానీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలికను చికిత్స నిమిత్తం వెంకటగిరిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో నిందితుడు హత్యకు వినియోగించిన చాకును స్వాధీనం చేసుకున్నారు.  అనంతరం పోలీసు ఎస్కార్ట్‌తో మెరుగైన చికిత్స నిమిత్తం బాలికను తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. బాధితురాలికి పోలీసు రక్షణ ఏర్పాటు చేశారు.

వారంలో చార్జిషీట్‌ : ఎస్పీ 
ఈ ఘటనపై ఎస్పీ సీహెచ్‌ విజయారావు నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో వివరాలు వెల్లడించారు. నిందితుడిపై హత్యాయత్నం, పోక్సో చట్టం కింద కేసు (సెక్షన్లు 354–డి, 452, 324,307ఐపిసి సెక్షన్‌ 10 ఆర్‌/డబ్ల్యూ 9 (ఐ) అండ్‌ సెక్షన్‌ 12 ఆఫ్‌ పోక్సోయాక్ట్‌ 2012) నమోదు చేశామన్నారు.

ఘటనపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి వారంలోపు కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ వెల్లడించారు. నిందితుడిపై సస్పెక్టెడ్‌ షీట్‌ తెరుస్తామన్నారు. కాగా, ప్రేమోన్మాది చెంచుకృష్ణ చేతిలో గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న జ్యోతిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు గజ్జల లక్ష్మి పరామర్శించారు. బాధితురాలికి మహిళా కమిషన్‌ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top