అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను రప్పించాలని.. పిల్లల మెడకు ఉరివేసి..

Man Accused Of Domestic Abuse Attempts To Hang Daughter To Get Estranged Wife Back Home - Sakshi

ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి రప్పించడానికి ..కన్న బిడ్డలను చంపడానికి ప్రయత్నించాడో కసాయి తండ్రి. ప్రస్తుతం ఈ సంఘటన ముంబైలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అజయ్‌ గౌడ్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ముంబైలోని ఈస్ట్‌ మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను పెయింటింగ్‌ పనిచేసేవాడు. ఇతనికి నలుగురు పిల్లలు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య కొంత కాలంగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అజయ్‌ ప్రతిరోజు మద్యంతాగి వచ్చి తన భార్య పూజను వేధించేవాడు. వీరిద్దరు ప్రతిరోజు గొడవలు పడుతుండేవాడు.

దీంతో విసిగిపోయిన పూజ...రెండేళ్ల క్రితం తన పిల్లలను తీసుకుని యూపీలోని తన గ్రామానికి వెళ్లి పోయింది. కాగా, గత జులై నెలలో అజయ్‌ గౌడ్‌ యూపీకి వెళ్లి భార్యను తిరిగి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీనికి పూజ నిరాకరించింది. దీంతో అజయ్‌గౌడ్‌ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఈ క్రమంలో తన పిల్లలను తీసుకుని ముంబై చేరుకున్నాడు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి వచ్చేలా చేయాలని ఒక ప్లాన్‌ వేశాడు. తన పిల్లలు చనిపోయినట్టు భార్యను నమ్మించాలని ప్రయత్నం చేశాడు.

ఒకరోజు మద్యం మత్తులో తన ఎనిమిదేళ్ల కుమారుడిని మృతిచెందిన విధంగా నెలపై పడుకొబెట్టాడు. అతని శరీరంపై తెలుపు వస్త్రాన్ని కప్పాడు. పూలదండలు వేశాడు. ఆ తర్వాత దానిముందు అగరోత్తులు వెలిగించాడు. ఆ తర్వాత తన 13 ఏళ్ల కూతురుని కూడా ఒక బకెట్‌పై నిలబెట్టి.. మెడకు చున్నిని చుట్టి ఫ్యాన్‌కు వేలాడదీశాడు. అంతటితో ఆగకుండా... దీన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. తన కుతూరుని బకెట్‌ను నెట్టివేయాల్సిందిగా బెదిరించాడు. దీంతో ఆ పిల్లలిద్దరు తండ్రి ప్రవర్తన పట్ల  భయపడిపోయి గట్టిగా ఏడుస్తూ, కేకలు వేశారు.

దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పిల్లలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కాగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లలిద్దరిని ఆ కసాయి తండ్రి బారినుంచి రక్షించారు. కాగా, అజయ్‌ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణంలో ఆవ్యక్తి.. తన భార్యను పిల్లల ఫోటోలు పంపి ఇంటికి రప్పించేందుకు ఇలా చేశానని అంగీకరించాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top