యూట్యూబ్‌ చూస్తూ ఇంట్లోనే డెలివరీ చేసుకున్న బాలిక.. తల్లి రావడంతో

Maharashtra: A 15 Year Old Girl Delivered at Her Home After Watching YouTube Videos - Sakshi

ముంబై: సోషల్‌మీడియా పరిచయాలు ఊహించని ప్రమాదంలో పడేయడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు చూస్తునే ఉన్నాం. తెలిసిన వాళ్లే మోసం చేస్తున్న రోజులివి, అలాంటిది కొందరు ఆన్‌లైన్‌ స్నేహాలను నమ్మి ఘోరంగా మోసపోతున్నారు. ప్రత్యేకంగా యువత కాలక్షేపం కోసం నెట్టింట్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఈ తరహాలోనే 15 ఏళ్ల బాలిక ఇంటర్నెట్‌లో పరిచయమైన వ్యక్తని నమ్మి గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా యూట్యూబ్‌లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది.

యూట్యూబ్‌ చూసి...
పోలీసుల వివరాల ‍ప్రకారం..నాగ్‌పూర్‌లోని అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో కూడా చెప్పలేదు. ఓ దశలో పొట్ట పెద్దగా ఉందని బాలిక తల్లి ప్రశ్నించగా.. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే కడుపు ఉబ్బందని అబద్దం చెప్పింది. అలా బాలిక గర్భవతినన్న విషయాన్ని తన తల్లి నుండి దాచి పెట్టగలిగింది. అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్‌ వీడియోలను చూసి తెలుసుకుంది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి ఇంట్లోనే ఓ బాక్స్‌లో దాచిపెట్టింది. తల్లి ఇంటికి తిరిగి రాగానే బాలిక తీవ్ర అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో బాలికను గట్టిగా నిలదీయగా విషయాన్ని మొత్తం తల్లికి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శిశువు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top