గోల్డ్‌ మెడలిస్ట్ పద్మజ.. ప్రస్తుతం భయంకరంగా

Madanapalle Double Murder Case Seems To Be Mystery - Sakshi

అందరూ ఉన్నత విద్యావంతులే 

మూఢ భక్తితో బిడ్డలను చంపేంత ఉన్మాదమా? 

ఆధ్యాత్మిక భావనను రగిల్చింది ఎవరు?  

నమ్మలేకపోతున్న సన్నిహితులు, బంధువులు 

మదనపల్లెలో మిస్టరీగా జంట హత్యలు

సంపన్న కుటుంబం. పురుషోత్తంనాయుడు ప్రభుత్వ కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌. ఆయన భార్య పద్మజ ప్రముఖ ప్రైవేట్‌ పాఠశాల కరస్పాండెంట్‌. మ్యాథ్స్‌లో గోల్డ్‌మెడలిస్ట్‌. వీరి పెద్దమ్మాయి అలేఖ్య(27) మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌లో కొంతకాలం పనిచేసి సివిల్స్‌కు ప్రిపేరవుతోంది. చిన్నకూతురు సాయిదివ్య బీబీఏ పూర్తిచేసి ఏఆర్‌.రెహమాన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటోంది. వీరికి తోడుగా ఒక పెంపుడు కుక్క. ఆహ్లాదకరమైన వాతావరణం. విశాలమైన కొత్త ఇల్లు. ఇలాంటి అపురూపమైన కుటుంబంలో అలజడి ఎందుకు పుట్టింది?.. కన్నబిడ్డలను చంపుకునేంత స్థాయికి తల్లిదండ్రులను ఎవరు తీసుకెళ్లారు. పిల్లల కన్నా మూఢభక్తి ఎక్కువైందా..? అతీంద్రియ శక్తులను ఉన్నట్లుగా ఊహించుకోవడమే ఈ హత్యకు కారణమైందా..? అని చర్చించుకుంటున్నారు. 

సాక్షి, తిరుపతి/మదనపల్లె‌: జంట హత్యకేసు ఉదంతం మిస్టరీ వీడనంటోంది. పిల్లలను హత్య చేసింది ఎవరో ఇప్పటికీ పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంనాయుడు ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉండడం బంధువులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. వారి మానసిక స్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానసిక వైద్యులు సైతం దంపుతులిద్దరి మానసిక స్థితి సరిగా లేదని అంటున్నారు.  చదవండి: (చిత్తూరు జిల్లాలో దారుణం..)

ఏమైంది తల్లీ! 
మ్యాథ్స్‌లో గోల్డ్‌ మెడలిస్ట్‌. ఎలాంటి లెక్కనైనా చిటికెలో చెప్పేయగల నేర్పరి పద్మజ. అలాంటి మహిళ మానసిక పరిస్థితి భయంకరంగా తయారైంది. మంగళవారం ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరోనా పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె కరోనా పరీక్ష చేసుకోవడానికి నిరాకరించారు. “ఎవరూ మాస్కులు వేసుకోవద్దు. శివ శరీరంలో నుంచే కరోనా పుట్టింది. కలి సంహారం చేసేటప్పుడు మిగిలిన చెత్త ఉంది కదా.. అది దులపడానికే నేను కరోనా వైరస్‌ను బాడీపార్ట్స్‌ నుంచి పంపించాను. చైనా నుంచి రాలేదు. నేను గొంతులో హలాహలాన్ని కలిగి ఉన్నాను. నాకు కరోనా పరీక్షలు అవసరం లేదు. మీరు దేవతనే పరీక్షిస్తారా..? నేను శ్యాంపిల్‌ ఇవ్వను. మీరు ఎవ్వరు.. నాకు చెప్పడానికి. నేను శివ. మార్చిలోపు వ్యాక్సినేషన్‌ లేకుండా కరోనా అంతమవుతుంది. అన్ని ఫార్మసూటికల్స్‌ కంపెనీలు మూసుకోవాలి’. అని ఆస్పత్రిలో హైరానా చేసింది. పోలీసులు ఇంటి నుంచి తీసుకువచ్చేటప్పుడు అవంతిక గుడికి వెళుతున్నానంటూ చేతులు తిప్పుతూ ఎవ్వరికో చెప్పినట్లుగా మాట్లాడింది.

 
పిల్లలతో పద్మజ, పురుషోత్తంనాయుడు

సారీ డాడీ! 
పురుషోత్తంనాయుడు మదనపల్లెలో పేరుమోసిన ప్రొఫెసర్‌. సైన్స్‌ పట్ల మక్కువ ఎక్కువ. పిల్లలను అపురూపంగా చూశాడు. ఇప్పుడు భార్య ప్రవర్తతో మానసిక వేదనకు లోనయ్యాడు. “మా కుటుంబానికి దరిద్రం పట్టింది. చేతులారా బంగారు తల్లులను చంపేసుకున్నాం.. సారీ డాడీ! అంటూ శ్మశానంలో రోదించడం అందరినీ కలచివేసింది. ఆస్పత్రిలో, పోలీసుల అదుపులో గుంభనంగా ఉంటూ, భార్యచేసే పిచ్చిచేష్టలను భరిస్తూ తనను సముదాయించేందుకు ప్రయత్నిస్తే.. నీవు నా భర్తవు కావు. నేను శివైక్యంలో ఉండగా నన్ను కంట్రోల్‌ చేయొద్దని చెప్పానా..? అని అరిస్తే మారుమాట్లాడకుండా ఆమెను అనుసరించారు. చదవండి: (ఇంకా మూఢత్వంలోనే.. తానే శివుడు, అవంతికనంటూ)

ఇది తెచ్చిపెట్టుకున్న రోగమేనా? 
పురుషోత్తంనాయుడు తన కుటుంబాన్ని స్వహస్తాలతో నాశనం చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. వారం క్రితం చిన్నమ్మాయి సాయిదివ్య కుక్కను తీసుకుని వాకింగ్‌ వెళ్తుండగా దారిలో ఎవరో మంత్రించి పడేసిన నిమ్మకాయను తొక్కింది. అప్పటి నుంచి తనకేదో కీడు జరుగుతోందని, తనకు తెలియకుండానే కొన్ని శక్తులు ఆవహించాయని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేది. దీన్ని గమనించిన పెద్దమ్మాయి అలేఖ్య తనకున్న శక్తులతో దుష్టశక్తిని పారద్రోలుతానని తల్లిదండ్రులను నమ్మించింది. “అనవసరంగా సమయం వృథా చేస్తున్నారు.. నేను శివ స్వరూపురాలిని, కాళికా దేవి తనను ఆవహించింది. చెల్లెలి శరీరంలోని కలి (దుష్టశక్తి)ని నాశనం చేస్తాను.’ అని నమ్మబలికింది. కుమార్తె మాటలు నమ్మి ఆమె చెప్పినట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాతే హత్యలు జరిగాయనేది పోలీసుల అనుమానం. చదవండి: (మదనపల్లి జంటహత్యల కేసులో కొత్త ట్విస్ట్)

సమయస్ఫూర్తితో వ్యవహరించకుంటే.. 
చిత్తూరు అర్బన్‌: మదనపల్లెలో వెలుగుచూసిన జంట హత్యల కేసులో పోలీసులు సమయస్ఫూర్తి ప్రదర్శించి.. మరో రెండు ప్రాణాలు కాపాడగలిగారు. పోలీసులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మరో రెండు ప్రాణాలు పోయుండేవన్నారు. పిల్లలను చంపేసిన తరువాత వాళ్లు కూడా ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు సమాచారం వచ్చిన వెంటనే మదనపల్లె సీఐ శ్రీనివా సులు, ఎస్‌ఐలు దిలీప్‌కుమార్, రమాదేవిని అలెర్ట్‌ చేశాం. ట్రాన్స్‌లో ఉన్న దంపతులను మామూలు పరిస్థితికి తీసుకొచ్చారు. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ప్రచారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.  – సెంథిల్‌కుమార్, చిత్తూరు ఎస్పీ

ఎవరో ప్రోద్భలం ఉంది! 
ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తి పురుషోత్తంనాయుడు. ఇతని అభివృద్ధిని ఓర్వలేకనే ఎవరో ప్రోద్భలంతో ఆ మత్తులోకి దించారని మా నమ్మకం. ఇతడి గురించి దాదాపు 29 ఏళ్లు తెలుసు. మంచి దైవచింతన కలిగిన వ్యక్తి. కన్నబిడ్డలను చంపుకునేంత కర్కశానికి వెళ్లాడంటే ఈ రోజుకీ నమ్మలేని స్థితిలో ఉన్నాం. దీనివెనుక ఎవరో వ్యక్తులు ఉన్నారనేది నిర్వివాదాంశం.  – జే.కృష్ణమూర్తి, సహోద్యోగి  

హిప్నటైజ్‌ చేశారు 
వాళ్లను ఎవరో మాస్‌ హిప్నటైజ్‌ చేశారు. మా కొలీగ్స్‌ అందరూ ఇదే అనుకుంటున్నాం. ఇదంతా ఈ మధ్య కాలంలోనే జరిగి ఉంటుంది. 15–20 రోజుల క్రితం చూసినప్పుడు ఏ విధమైన మార్పులు వారిలో లేవు. చాలా షాకింగ్‌గా ఉంది. వీరి ట్రాన్స్‌ వెనుక ఏదో బలమైన కారణం ఉంది.  – ఆర్‌.సి.ఉమశ్రీ, కామర్స్‌లెక్చరర్, ఉమెన్స్‌కాలేజ్‌  

మానసిక స్థితి సరిగాలేదు 
జంటహత్యల కేసులో నిందితుల మానసిక పరిస్థితి బాగోలేదు. పద్మజ మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఏం చెబుతుందో దానిని  భర్త బలంగా నమ్ముతున్నారు. ఆయన మా పిల్లలు తిరిగి వస్తున్నారని చెపుతున్నారు. వారిని గమనిస్తే మానసికవ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తగిన చికిత్సలు అందిస్తే మంచి జరుగుతుంది. 
– డాక్టర్‌.రాధిక, సైక్రియాటిస్ట్, జిల్లా ఆస్పత్రి, మదనపల్లె  

అన్ని కోణాల్లో దర్యాప్తుచేశాకే.. 
పిల్లలను వారి తల్లిదండ్రులే దారుణంగా హత్య చేశారు. హత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేశాకే నిందితులను అరెస్టుచేశాం. ఇతరుల ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. కొన్ని కల్పితాలను ప్రజలు నమ్మకూడదు.  -రవిమనోహరాచారి, డిఎస్పీ, మదనపల్లె

వాటికి అతిదగ్గర సంబంధం ఉంది 
మానసిక ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు అతి దగ్గర సంబంధం ఉంది. అతి భక్తి కలిగిన వారికి(అంటే బౌండరీలను అన్నిటినీ అధిగమించేసి ఉన్న భక్తి/ఆధ్యాత్మికత) స్కిజోఫ్రేనియ అనే మనోవైకల్యం కలిగిన వారిలో మొదటి స్టేజ్‌. ఇలాంటి వారు మతపరమైన భ్రమలను కలిగి ఉంటారు. దేవుడు తమను నడిపిస్తున్నాడని భావిస్తుంటారు. వీరికి తక్షణమే డోపమైన్‌ ఇంజెక్షన్, కొన్నిసార్లు షాక్‌ ట్రీట్మెంట్‌ ఇచ్చి వైద్యుల పర్యవేక్షణలో కాస్త అందరికీ దూరంగా ఏకాంతంలో ఉంచాలి. 
– డా.ఐ.ఎస్‌.స్రవంతి, క్లినికల్‌ సైకాలజిస్టు, తిరుపతి 

ఇదో మానసిర రుగ్మత 
మదనపల్లెలో చోటు సంఘటనలో తమ ఇద్దరు కుమార్తెలను  తల్లిదండ్రులు చంపడం అనే సంఘటనపై మీడియాలో వచ్చిన  ఉన్న కథనాలు పరిశీలిస్తే వారు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. ఈ తరహా రుగ్మతను షేర్డ్‌ సైకోటిక్‌ డిజార్డర్‌ అని అంటారు. దీనిని మూఢనమ్మకం అనే  కంటే మానసిక రుగ్మత అనవచ్చు.  
– డాక్టర్‌ వి.సాహితీరెడ్డి, సైక్రియాటిస్ట్, తిరుపతి 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top