ప్రేయసి గొంతుకోసి.. ప్రియుడి ఆత్మహత్య 

Lovers Ends Their Life In Lemon Tree Hotel Madhapur - Sakshi

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ లెమన్‌ట్రీ హోటల్‌లో ఘటన

ఇద్దరివీ పక్కపక్క గ్రామాలే.. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నవారే

కొన్నాళ్లుగా ప్రేమ.. పెళ్లి విషయంగా వివాదం!

ఈ క్రమంలోనే హత్య,ఆత్మహత్యకు పాల్పడినట్టు సందేహిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌/ కోస్గి/బొంరాస్‌పేట: వారిద్దరివీ పక్కపక్క ఊర్లు.. చిన్నప్పటి నుంచీ కలిసి చదువుకున్నారు.. ఆమె ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతుండగా.. అతను రెండు కార్లు కొనుక్కుని ట్రావెల్స్‌ నడుపుతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో సొంతూర్లకు వెళ్లినప్పుడు ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించింది. కలిసి బతకాలనుకున్నారు. కానీ అంతలోనే ఆ యువకుడు ఆమెను హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న లెమన్‌ట్రీ హోటల్‌లో ఈ దారుణ ఘటన జరిగింది.

ఆ యువతి వికారాబాద్‌ జిల్లా బొంరాసుపేట మండలం లగచర్లకు సంతోషి (25) కాగా.. ఆ యువకుడు ఆ ఊరికి పక్కనే ఉన్న నారాయణపేట జిల్లా కోస్గి మండలం హకీంపేటకు చెందిన జి.రాములు (25). హత్య, ఆత్మహత్య దారుణాన్ని గుర్తించిన హోటల్‌ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో ఇంటికి వెళ్లి..: హకీంపేటకు కిష్టయ్య, మొగులమ్మల కుమారుడు రాములు (25). సొంతంగా రెండుకార్లు కొనుగోలు చేసి హెదరాబాద్‌లో ట్రావెల్స్‌ నడుపుతున్నాడు. లగచర్లకు చెందిన ఈడిగి బాలమణి, ఈశ్వరయ్య దంపతుల ఐదో సంతానం సంతోషి (25). ఆమె కానిస్టేబుల్‌ పోస్టులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్షలకు సిద్ధమవుతోంది. కొంతకాలం హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో స్వగ్రామానికి వెళ్లిన రాములు, సంతోష ప్రేమలో పడ్డారు. అయితే బుధవారం మధ్యాహ్నం వారిద్దరూ మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్‌ మూడో అంతస్తులో ఉన్న 317 నంబర్‌ గదిలో దిగారు.

బుకింగ్‌ ప్రకారం గురువారం మధ్యాహ్నం గది ఖాళీచేసి వెళ్లిపోవాలి. కానీ మరో రోజు ఉంటామంటూ గడువు పెంచారు. గురువారం సాయంత్రం వారిమధ్య గొడవ జరిగింది. అటువైపుగా వెళ్తున్న ఒక రూమ్‌బాయ్‌ ఈ ఘర్షణ శబ్ధాలు విని.. హోటల్‌లో మిగతా సిబ్బందికి చెప్పాడు. చాలాసేపు ఎలాంటి అలికిడీ రాకపోవడంతో హోటల్‌ సిబ్బంది మారుతాళంతో గది తలుపులు తెరిచి చూశారు. బాత్రూమ్‌లో సంతోషి మృతదేహాన్ని, ఫ్యాన్‌కు వేలాడుతున్న రాములు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

బ్లేడుతో గొంతు కోసి.. 
హోటల్‌కు వెళ్లిన పోలీసులు బాత్రూంలో రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న సంతోషి మృతదేహాన్ని.. అక్కడినుంచి బెడ్‌ వరకు రక్తంతో కూడిన పాదాల గుర్తులు, రక్తం చుక్కలను గుర్తించారు. గదిలో ఇద్దరి మధ్యా గొడవ జరిగినప్పుడు ఆవేశంతో విచక్షణ కోల్పోయిన రాములు బ్లేడుతో సంతోషి గొంతు కోశాడని.. తర్వాత ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. క్లూస్‌టీం బాత్రూమ్‌లో హత్యకు వినియోగించిన బ్లేడ్‌ను, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుంది. ఆ గదిలో సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు, ఓ ప్రైవేట్‌ ఈఎన్‌టీ ఆస్పత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్‌ కార్డులు లభించాయి. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో హకీంపేట, లగచర్ల గ్రామాల్లో విషాదం అలుముకుంది. 

కొన్నాళ్లుగా కలిసి ఉంటూనే.. 
సంతోషి, రాములు ఇద్దరూ గతంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారని.. కొంతకాలం హైదరాబాద్‌లో కలిసి ఉన్నారని హకీంపేట, లగచర్ల గ్రామాలకు చెందిన స్థానికులు తెలిపారు. ఇరు కుటుంబాల వారు అభ్యంతర పెట్టడంతో విడిగా ఉంటున్నారని తెలిపారు. కొన్నాళ్లుగా వారు సొంతూర్లలోనే ఉంటున్నారని.. కలిసి బతుకుదామని ఇటీవలే నిర్ణయించుకుని హైదరాబాద్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఇంతలో ఏదైనా గొడవ జరిగి, ఈ దారుణానికి కారణమై ఉంటుందని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top