కరోనా: జిల్లా ఆస్పత్రి సిబ్బందిపై దాడి

Locals Attack On Hospital Staff In Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: జిల్లా ఆస్పత్రిలో కోవిడ్‌ నిబంధనల ప్రకారం ఆదివారం రాత్రి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై కొందరు విచక్షణరహితంగా దాడి చేశారు. టూటౌన్‌ సీఐ శ్రీనివాసాచారి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో పట్టణంలోని కొత్త చెరువు రోడ్‌కు చెందిన కోట్ల బాలస్వామి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే కుటుంబ సభ్యులు, బంధువులు చికిత్స నిమిత్తం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో  కొంత ఉపశమనం పొందాడు. ఈ విషయం తెలుసుకున్న అతనికి సంబంధించిన కొంత మంది వ్యక్తులు ఒకేసారి క్యాజువాలిటీ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ విధుల్లో  సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ దేవానంద్, వార్డ్‌బాయ్‌ శంకర్‌లు వారిని వారించారు.

ఇంతమంది కరోనా సమయంలో  ఒకేసారి లోపలికి వెళ్లరాదని వారించారు. అక్కడ ఉన్న కొంత మంది శంకర్‌ను గుర్తు తెలియని ఆయుధంతో తలపై కొట్టడంతో రక్తగాయాలయ్యాయి, దేవానంద్‌పైనా దాడి చేసి గాయపర్చారు. డ్యూటీలో ఉన్న వైద్యుడిపై దౌర్జన్యంగా మాట్లాడటంతో పాటు అతని విధులకు ఆటంకం కల్గించారు. ఆర్‌ఎంఓ సాయిబాబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పడకుల ప్రకాష్, మహేష్,కోట్ల నర్సింహులు, వెంకటేష్, రమేష్, శ్రీధర్, మెకానిక్‌ శ్రీను, మెకానిక్‌ బాలస్వామి, బాలరాజ్‌లపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. 

సిబ్బంది నిరసన   
జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ఆస్పత్రి శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ దేవానంద్, వార్డుబాయ్‌ శంకర్‌లపై అకార ణంగా దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సోమవా రం తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్క్‌ర్స్‌ యూనియన్‌ సభ్యులు నిరసన తెలిపారు.  కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి , సభ్యులు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top