కింగ్‌కోఠి ప్యాలెస్‌పై రగడ

King Koti Palace Land Controversy: 38 Booked in Hyderabad - Sakshi

రూ.200 కోట్ల విలువైన స్థలంపై ఇరు వర్గాల కొట్లాట

తమదంటే తమదంటూ ముదురుతున్న వివాదం

ఈ నెల 8న ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

తాజాగా ప్యాలెస్‌లోకి ఐరిస్‌ హాస్పిటాలిటీ మనుషుల చొరబాటు

38 మందిపై కేసు నమోదు చేశామన్న ఏసీపీ వెంకట్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: నిజాం నవాబ్‌ పాలించిన ‘కింగ్‌కోఠి’ ప్యాలెస్‌ వివాదాల్లో చిక్కుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్యాలెస్‌ వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలివానలా పరిణమించింది. సదరు స్థలం తమదంటే తమదంటూ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. సుమారు రూ.200 కోట్ల విలువైన ఈ స్థలంలోకి జేసీబీలతో చొరబడ్డ 38 మందిపై సోమవారం నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.   

ఎందుకీ వివాదం?  
కింగ్‌కోఠి నజ్రీబాగ్‌లోని ‘కింగ్‌కోఠి’ ప్యాలెస్‌ను నగరానికి చెందిన ‘నిహారిక ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ నుంచి కశ్మీర్‌కు చెందిన ‘ఐరిస్‌ హాస్పిటాలిటీ’ వారు 2019 జనవరి 28న సేల్‌డీడ్‌ చేసుకున్నారు. అనంతరం మహ్మద్‌ ఫరీదుద్దీన్‌ అనే వ్యక్తిని వాచ్‌మన్‌గా నియమించిన ‘ఐరిస్‌ హాస్పిటాలిటీ’ వాళ్లు.. తిరిగి కశ్మీర్‌కు వెళ్లిపోయారు. ఇటీవల వాచ్‌మన్‌ ఫరీదుద్దీన్‌ మృతి చెందడంతో స్థలాన్ని పరిశీలించేందుకు డైరెక్టర్‌ అర్జున్‌ ఆమ్లా కశ్మీర్‌ నుంచి ఈ నెల 4న నగరానికి వచ్చారు.  

ఆ సమయంలో టోలిచౌకికి చెందిన సయ్యద్‌ అక్తర్‌ తన మనుషులతో ప్యాలెస్‌లోకి చొరబడినట్లు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నిహారిక ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌’కు సంబంధించిన ‘ఎంఎస్‌ అగర్వాల్‌ రియాల్టీ డెవలపర్స్‌’కు చెందిన రాజేష్‌ అగర్వాల్, జి.దినేష్‌కుమార్, మరికొందరి డైరెక్టర్ల పేర్లు సయ్యద్‌ అక్తర్‌ తెలపడంతో.. వీరిపై ఈ నెల 8న నారాయణగూడ పోలీసులు సెక్షన్‌ 452, 506, 109, 120బి కింద కేసు నమోదు చేశారు.  

తాజాగా 38 మందిపై కేసులు.. 
తాము కొనుగోలు చేసిన స్థలంలో వేరేవాళ్లు రావడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ‘ఐరిస్‌ హాస్పిటాలికీ’కి సంబంధించిన డైరెక్టర్లు తమ అనుచరులతో కలిసి జేసీబీతో ప్యాలెస్‌ లోపలికి చొరబడ్డారు. ఈ విషయాన్ని అక్కడున్న వారు పోలీసులకు తెలపగా.. హుటాహుటిన అబిడ్స్‌ ఏసీపీ కే.వెంకట్‌రెడ్డి, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ భూపతి గట్టుమల్లు, క్రైం ఇన్‌స్పెక్టర్‌ ముత్తినేని రవికుమార్, ఎస్సైలు సంఘటన స్థలానికి వచ్చారు. లోపలికి చొరబడ్డ సుమారు 38 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా వీరంతా ‘ఐరిస్‌ హాస్పిటాలిటీ’కి చెందిన వారని తెలిసింది. దీంతో 38 మందిపై ‘ఎంఎస్‌ అగర్వాల్‌ రియాల్టీ డెవలపర్స్‌’కు చెందిన రాజేష్‌ అగర్వాల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  

ప్యాలెస్‌కు సంబంధించిన స్థలం మొత్తాన్ని నగరానికి చెందిన  ‘నిహారిక ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ వారు ఎవరి నుంచి కొన్నారు? వీరు కశ్మీర్‌కు చెందిన ‘ఐరిస్‌ హాస్పిటాలిటీ’కి ఏ విధంగా అమ్మారు? అనే విషయాలపై స్పష్టత లేకుండాపోయింది. ఇదే వ్యవహారంపై 2019లో సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌తో పాటు ముంబైలోని వర్లి పోలీసు స్టేషన్‌లో రాజేష్‌ అగర్వాల్‌ ఈ ల్యాండ్‌ తనదేనంటూ కొందరు కబ్జా చేశారని ఫిర్యాదు చేయగా..ఆయా పోలీసుస్టేషన్‌లలో కేసులు కూడా నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top