భూకబ్జా కేసులో కన్నారావు అరెస్టు 

Kanna Rao arrested in land grabbing case - Sakshi

వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించిన పోలీసులు 

14 రోజులు రిమాండ్‌ విధించిన ఇబ్రహీంపట్నం కోర్టు 

ఇబ్రహీంపట్నం రూరల్‌: భూకబ్జా వవహారంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్న కుమారుడు తేజేశ్వర్‌రావు అలియాస్‌ కన్నారావును మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. మన్నెగూడలో రెండు ఎకరాల స్థలం సెటిల్‌మెంట్‌ వ్యవహారంలో మార్చి 3న కన్నారావుపై ఆదిబట్ల పోలీసులు కేసు (క్రైం నంబరు 123/2024) నమోదు చేశారు. మన్నెగూడకు చెందిన జక్కిడి సురేందర్‌రెడ్డి అవసరం నిమిత్తం చావ సురేష్‌ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడు. ఇందుకోసం తన భూమిని ఏజీపీఏ చేశాడు. చావ సురేష్‌ సేల్‌డీడ్‌ చేసుకొని ఓఎస్‌ఆర్‌ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేశాడు.

ఎలాగైనా భూమిని చావ సురేష్ కు దక్కకుండా చూడాలని జక్కిడి సురేందర్‌రెడ్డి అతని బంధువుల ద్వారా కన్నారావును ఆశ్రయించాడు. దీంతో రూ. 3 కోట్లు ఇస్తే సెటిల్‌ చేస్తానని కన్నారావు చెప్పడంతో రూ. 2.30 కోట్లను సురేందర్‌రెడ్డి కన్నారావుకు ఇచ్చాడు. రోజులు గడిచినా ఆయన ఎలాంటి పని చేయకపోవడం, ఓఎస్‌ఆర్‌ కంపెనీ యాజమాన్యం స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి హద్దులు పెట్టుకోవడంతో ఇదేమిటని సురేందర్‌రెడ్డి కన్నారావును ప్రశ్నించాడు. దీంతో మార్చి 3న కన్నారావు మనుషులు వచ్చి ఆ భూమిని కబ్జా చేసి అందులోని సామగ్రి ధ్వంసం చేశారు. దీనిపై అదే రోజు ఆదిబట్ల పోలీసులకు ఓఎస్‌ఆర్‌ కంపెనీ యజమాని ఫిర్యాదు చేయడంతో కన్నారావుతోపాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. వారిలో పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

బెయిల్‌కు ప్రయత్నిస్తూ పట్టుబడి.. 
తనపై కేసు నమోదైనప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా బెంగళూరు, ఢిల్లీలో తలదాచుకున్న కన్నారావు.. తనపై కేసును తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను కోర్టు కోట్టేయడంతో బెయిల్‌ కోసం మరో పిటిషన్‌ వేశాడు. దాన్ని కూడా న్యాయస్థానం కొట్టేయడంతో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని తన అడ్వకేట్‌ను కలవడానికి కన్నారావు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

సోమవారం రాత్రి 12:30 గంటలకు బాలాపూర్‌లో ఆదిబట్ల పోలీసులకు కన్నారావు పట్టుబడ్డాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఆయన ఏ3గా ఉన్నాడు. కన్నారావుపై 307, 436, 447, 427, 148 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఇబ్రహీంపట్నం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. 

నేనే ఫోన్‌ చేసి లొంగిపోయా: కన్నారావు  
ఇది ఒక భూ వివాద సమస్య. ఇందులో కొద్దిగా నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు పెట్టారు. ఈ సెక్షన్లకు ముందస్తు బెయిల్‌ లభించనందున ఆదిబట్ల ఎస్సై రాజు, సీఐ రాఘవేందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఫలానా చోట ఉన్నానని చెప్పి సరెండర్‌ అయ్యాను. నాకు కచ్చితంగా బెయిల్‌ వస్తుంది. ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. 

Election 2024

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top