Jubilee Hills Amnesia Pub Case: గ్యాంగ్‌ రేప్‌ నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు

Jubilee Hills Amnesia Pub Case: Police Investigate Should Punished - Sakshi

సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో నిందితుడు, చట్టంతో విభేదించిన బాలురకు కచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే వీరికి టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పెరేడ్‌ (టీఐపీ) పూర్తి చేసిన అధికారులు నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు న్యాయస్థానాలు అనుమతి మంజూరు చేయడంతో తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అవసరమైన పక్షంలో బాధితురాలి నుంచీ నమూనాలు సేకరించాలని యోచిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ కేసులో సాదుద్దీన్, మరో ఐదుగురు చట్టంతో విభేదించిన బాలురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు సైతం పట్టుబడి జువైనల్‌ హోమ్‌కు చేరాడు.

అయితే ఇతడు కేవలం బెంజ్‌ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించడానికి సంబంధించి మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సాదుద్దీన్, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారుడు సహా ఐదుగురు మాత్రం గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాన్‌సూ బేకరీ నుంచి బాలికను ఇన్నోవా కారులో పెద్దమ్మ గుడి సమీప ప్రాంతాలకు తీసుకువెళ్లిన ఈ ఐదుగురూ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో వెంట్రుకలు, వినియోగించిన టిష్యూ పేపర్లతో సహా అనేక ఆధారాలు సేకరించారు. బాలిక పోలీసులకు, న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలోనూ తనపై ఆ కారులోనే అఘాయిత్యం జరిగినట్లు బయటపెట్టింది.

దీంతో ఇన్నోవా కారులో లభించిన ఆధారాలు క్లూస్‌ టీమ్‌ ద్వారా సేకరించిన పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. ఇప్పుడు సాదుద్దీన్‌ సహా ఐదుగురి నుంచి సేకరించిన నమూనాలకూ పంపనున్నారు. ఈ రెండింటినీ సరిపోల్చే నిపుణులు ఆ రోజు కారులో ఉన్నది, బాలికపై అఘాయిత్యానికి పాల్పడింది వీరేనంటూ సాంకేతికంగా నిర్థారించనున్నారు. పోలీసులు దాఖలు చేసే అభియోగపత్రాల్లోనూ ఈ అంశాన్ని పొందుపరుస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి ఇది కీలకం కానుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

మరోపక్క ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కోర్టుల్లో బెయిల్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసులు కోర్టును కోరుతున్నారు. కాగా బాలికపై సామూహిక అత్యాచారంలో ఎమ్మెల్యే కుమారుడి పాత్ర లేకున్నా... బెంజ్‌ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు, ఆధారాలు ఉండటంతోనే జువైనల్‌ హోమ్‌కు చేరాడు. ఇతడిపై ఐపీసీతో పాటు పోక్సో యాక్ట్‌ కింద సదరు ఆరోపణలు నమోదు చేశారు. ఆమ్నేషియా పబ్‌ వద్ద సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఓ కీలక విషయం గుర్తించారు. ఇన్నోవా కారులో అప్పటికే ఉన్న సాదుద్దీన్‌ను దింపిన ఎమ్మెల్యే కుమారుడు అక్కడే కారు ఎక్కాడని, అలా ఈ కేసులో చిక్కాడని తెలుసుకున్నారు.    

(చదవండి: కోర్టును ఆశ్రయించిన పోలీసులు.. ఎందుకంటే..?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top