వీడిన మిస్టరీ: నీటి కుంటలో శవమై తేలిన జయశీల్‌రెడ్డి

Jayasheelreddy Passed Away On Farm Field At Nalgonda - Sakshi

శవమై తేలిన జయశీల్‌రెడ్డి 

వ్యవసాయ క్షేత్రంలోని కుంటలోకి ప్రమాదవశాత్తు జారినట్లు ఆనవాళ్లు 

ఈత రాకపోవడం.. బంక మట్టి కావడంతో పైకిరావడంలో విఫలం

నల్లగొండ క్రైం: సోమవారం తన వ్యవసాయ క్షేత్రంలో అదృశ్యమైన దేవిరెడ్డి జయశీల్‌రెడ్డి (42) మంగళవారం నీటి కుంటలో శవమై తేలారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బాబాయ్‌ కుమారుడు జయశీల్‌రెడ్డి నల్లగొండ మండలంలోని మేళ్లదుప్పలపల్లి గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించేందుకు వచ్చి అక్కడే కుంటలో కాలుజారి పడి మృతిచెందారు. మంగళవారం జాలర్ల వలకు అతడి మృతదేహం చిక్కింది. జయశీల్‌రెడ్డి సోమవా రం హైదరాబాద్‌ నుంచి తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చా రు.

కుంటపైనుంచి వ్యవసాయ క్షేత్రంలోకి మట్టి రోడ్డు ఉంది. కట్టపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వర్షం కారణంగా కాలు జారి నీటి కుంటలో పడిపోయా రు. ఈత రాకపోవడంతో నీటిలో నుంచి బయటికి రాలేక ప్రాణాలు విడిచారు. కుంటలోనుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించినట్లుగా మృతదేహం కాళ్లకు, చేతులకు బురద అంటి ఉంది. నీటిలో నుంచి పైకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బంక మట్టి కావడం, కాళ్లకు బూట్లు ఉండటంతో నీటిలో నుంచి పైకి అడుగు వేయలేకపోయినట్లుగా భావిస్తున్నారు. 

నీటి బుడగలతో గుర్తించారు.. 
జయశీల్‌రెడ్డి కోసం కుంటలో, పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో సోమవారం నుంచి గాలించారు. జాలర్లు చేపలు పట్టే తెప్పతో గాలిస్తుండగా కట్టకు సమీపంలో నీటి బుడ గలు పైకి వస్తుండటంతో అనుమానం వచ్చి వల విసిరా రు. తల భాగం వలకు చిక్కి పైకి కనిపించడంతో మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. జయశీల్‌రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు తరలించారు.

ఎల్బీనగర్‌ ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి, జయశీల్‌రెడ్డి తల్లిదండ్రులు సునంద, జగదీశ్వర్‌రెడ్డి, కుటుంబ సభ్యులంతా రెండు రోజులుగా వ్యవసాయ క్షేత్రం వద్దనే ఉన్నారు. అమెరికా వెళ్లాల్సిన కుమారుడు విగతజీవిగా కనిపించడంతో వారు గుండెలవిసేలా రోదించారు. మృతదేహానికి నల్లగొండ ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌  రమేష్‌గౌడ్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top