వివాహేతర సంబంధం.. ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష

Jail for the wife who tried to kill her husband - Sakshi

వరంగల్‌ లీగల్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త అడ్డు తొలగించేందుకు హత్యా యత్నానికి పాల్పడిన మహిళకు జైలు శిక్ష పడింది. భర్తపై హత్యాయత్నం నేరంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన ఇల్లందుల ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి బి.శ్రీనివాసులు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. ముత్తారం గ్రామానికి చెందిన ఇల్లందుల చొక్కయ్య, ప్రేమలత దంపతులు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రేమలత అదే గ్రామానికి చెందిన కడారి వీరభద్రయ్యతో కలిసి తిరుగుతోందని, ఇది సరైంది కాదని చొక్కయ్య ఫిర్యాదు మేరకు గ్రామ పెద్దమనుషులు ప్రేమలతను మందలించారు.

 అయినా ఆమెలో మార్పు రాలేదు. పైగా తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రేమలత ప్రణాళిక వేసుకుంది. ఏప్రిల్‌ 24, 2014 అర్ధరాత్రి నిద్రిస్తున్న చొక్కయ్యపై గొడ్డలితో దాడి చేసింది. తలకు, చేతులకు, ఛాతిపై గాయాలై విపరీతంగా రక్తం కారుతుండగా... చొక్కయ్య గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు రావడంతో ప్రేమలత పారిపోయింది. క్షతగాత్రుడిని స్థానికులు అర్ధరాత్రి ముల్కనూరులోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలిసి ముల్క నూరులో ఉన్న చొక్కయ్య సోదరి పుల్ల స్వరూప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణలో సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు నేరం రుజువుకావడంతో ప్రేమలతకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి శ్రీనివాసులు తీర్పు వెల్లడించారు. కేసును పోలీసు అధికారులు సతీశ్‌కుమార్, ఎం.మహేందర్‌ పరిశోధించగా.. లైజన్‌ ఆఫీసర్‌ డి.వెంకటేశ్వర్లు విచారణ పర్యవేక్షించారు. సాక్షు్యలను కానిస్టేబుల్‌ ఎ.రవి కోర్టులో ప్రవేశపెట్టగా.. ప్రాసిక్యూషన్‌ పక్షాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.భద్రాద్రి కేసు వాదించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top