పాలసీ క్లైమ్‌లు మార్చుకోండంటూ.. రూ 50 లక్షలు స్వాహా

Insurance Fraud: Hyderabad Police Arrested Accused - Sakshi

ఇన్సూరెన్స్‌ ఫ్రాడ్‌లో రూ.50 లక్షల స్వాహా

నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌ 

ఉద్యోగాలంటూ మోసం కేసులో మరొకరు.. 

ఢిల్లీలో పట్టుకుని సిటీకి తరలించిన పోలీసులు

సాక్షి, సిటీబ్యరో: ఢిల్లీ కేంద్రంగా నగరానికి చెందిన ఇద్దరిని మోసం చేసిన సైబర్‌ నేరగాళ్లను సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని ఇన్సూరెన్స్‌ ఫ్రాడ్‌లో, మరొకరిని జాబ్‌ ఫ్రాడ్‌లో పట్టుకున్నారు. ఇరువురినీ మంగళవారం సిటీకి తరలించిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన భానుప్రతాప్‌ సింగ్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానంలో ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఇలా ఇతడి వద్దకు దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీ హోల్డర్ల వివరాలు వచ్చి చేరేవి. వీటి ఆధారంగా 2019లో నగరానికి చెందిన ఓ మహిళకు ఫోన్‌ చేశారు. ఈమె 2012లో రెండు బ్యాంకుల నుంచి ఆరు పాలసీలు తీసుకుని ఏటా రెన్యువల్‌ చేస్తూ వచ్చారు.  

బాధితురాలితో మాట్లాడిన భాను ప్రతాప్‌ మీ పాలసీలకు సంబంధించిన క్లైమ్‌లు ఇప్పటికీ కంపెనీల పేరుతో ఉన్నాయని, తప్పనిసరిగా మీ పేరుతో మార్చుకోవాలంటూ చెప్పాడు. దానికోసం ముందుగా కొంత మొత్తం చెల్లించాలంటూ అసలు కథ మొదలెట్టాడు. దఫదఫాలుగా రూ.50 లక్షలు ఆమె నుంచి కాజేశాడు. ఎట్టకేలకు మోసపోయానని గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ నేతృత్వంలోని బృందం భాను ప్రతాప్‌ ఆచూకీని ఢిల్లీలో కనిపెట్టింది. అక్కడకు వెళ్లి అతడిని అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చింది. నిందితుడి నుంచి 20 తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  

ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాలంటూ... 
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో వివిధ రకాలైన ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇచ్చి మోసం చేసిన కేసులో ఢిల్లీకే చెందిన రప్‌ కిషోర్‌ను సి టీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతగాడు నగరానికి చెందిన ఇద్దరి నుంచి ర.1.39 లక్షలు కాజేసినట్లు గుర్తించారు. దేశ వ్యాప్తంగా మో సాల కు పాల్పడిన ఇతడిని సైతం ఢిల్లీలో అరెస్టు చేసిన ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ నేతృత్వంలోని బృందం పీటీ వారెంట్‌పై మంగళవారం సిటీకి తీసుకువచ్చి రి మాండ్‌కు పంపింది. ఇతడితో పాటు ఇన్సూరెన్స్‌ ఫ్రాడ్‌లో నిందితుడిగా ఉన్న భాను ప్రతాప్‌ను న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకు ని విచారించాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిర్ణయించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top