మీడియా సంస్థలపై ఐటీ దాడులు

Income Tax raids at media group Dainik Bhaskar premises across country - Sakshi

దైనిక్‌ భాస్కర్, భారత్‌ సంచార్‌ కార్యాలయాల్లో సోదాలు

మీడియాని భయపెడుతున్నారని సర్వత్రా విమర్శలు

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను ఎగవేత ఆరోపణలతో మీడియా సంస్థలపై ఐటీ శాఖ కొరడా ఝళిపించింది. దైనిక్‌ భాస్కర్, భారత్‌ సంచార్‌ మీడియా సంస్థలకి చెందిన పలు నగరాల్లోని కార్యాలయాలపై దాడులకు దిగింది. భోపాల్, జైపూర్, అహ్మదాబాద్, నోయిడాతోపాటు దేశంలోని ఇతర నగరాల్లోని దైనిక్‌ భాస్కర్‌ కార్యాలయాలపై, ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యూస్‌ చానెల్‌ భారత్‌ సంచార్, ఆ సంస్థ ప్రమోటర్స్, సిబ్బందిపై లక్నోలో దాడులు నిర్వహించినట్టుగా ఐటీ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ టెక్స్‌టైల్స్, మైనింగ్‌ వ్యాపారాలూ ఉన్నాయని, వాటికి సంబంధించిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించినట్టుగా ఆ అధికారి చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దైనిక్‌ భాస్కర్‌ యాజమానుల నివాసాల్లోని సోదాలు నిర్వహించింది. 

ఈ రెండు మీడియా సంస్థలు కరోనా సెకండ్‌ వేవ్‌  ఎదుర్కోవడంలో కేంద్రం వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల్ని హైలైట్‌ చేస్తూ పలు కథనాలు చేశాయి. దేశంలో 12 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న దైనిక్‌ భాస్కర్‌ 65 ఎడిషన్లను, 211 సబ్‌ ఎడిషన్లను హిందీ, గుజరాతీ, మరాఠీ భాషనల్లో ప్రచురిస్తోంది. 7 రాష్ట్రాల్లో 30 రేడియో స్టేషన్లు నిర్వహించడంతో పాటుగా వెబ్‌ పోర్టల్స్, ఫోన్‌ యాప్స్‌ ఉన్నాయి. భారత్‌ సంచార్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ బ్రజేశ్‌ మిశ్రా, స్టేట్‌ హెడ్‌ వీరేంద్ర సింగ్‌తో పాటు కొందరు ఉద్యోగుల ఇళ్లల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిందని ఆ టీవీ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో తెలిపింది. తర్వాత దైనిక్‌ భాస్కర్‌ తన వెబ్‌సైట్‌లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలోని తమ కార్యాలయాల్లో సోదాలు చేసినట్టు వెల్లడించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ప్రభుత్వ అసమర్థతను తాము బహిర్గతం చేయడం వల్లే ఈ దాడులకు దిగిందని దైనిక్‌ భాస్కర్‌ ఆరోపించింది.  

రాజ్యసభలో ధ్వజమెత్తిన కాంగ్రెస్‌  
మీడియాపై దాడుల్ని రాజ్యసభలోనూ విపక్ష నేతలు ప్రస్తావించారు. కాంగ్రెస్‌ నాయకుడు దిగ్వి జయ్‌ సింగ్‌ సభలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ కేంద్రం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తుందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్‌ చేసిన విమర్శ ల్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తిప్పికొట్టారు. కేంద్ర  సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని అన్నారు. ఎవరైనా పూర్తి సమాచారాన్ని తెలుసుకొని నిర్ధారణ చేసుకోవాలని, కొన్ని అంశాలు వాస్తవ దూరంగా ఉంటాయని వివరణ ఇచ్చారు.

పాఠకులే సుప్రీం: దైనిక్‌ భాస్కర్‌
తమ కార్యాలయాలపై ఐటీ దాడులపై దైనిక్‌ భాస్కర్‌ మీడియా గ్రూపు స్పందించింది. ‘మేము స్వతంత్రులం. పాఠకుల అభీష్టమే మాకు పరమావధి’ అని తమ వెబ్‌సైట్లో పేర్కొంది. కరోనా సెకండ్‌ వేవ్‌లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు పర్యవసానంగానే ఐటీ దాడులని తెలిపింది. తమ గ్రూపు ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయని, మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని, నైట్‌షిఫ్ట్‌లో ఉన్న ఉద్యోగులను  ఇళ్లకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top