వారంలో పీజీ!.. లాడ్జీల్లో పరీక్షలు 

Illegal Promotion In Education Department IN Anantapur - Sakshi

వారంలోనే పీజీ సర్టిఫికెట్లు తెచ్చిన అయ్యవార్లు 

వర్సిటీకి పంపి విచారించని విద్యాశాఖ అధికారులు 

సాక్షి,అనంతపురం: రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సు వారం రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా?.. తాము తలచుకుంటే సాధ్యమేనని నిరూపించారు జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు. పైగా ఆ సర్టిఫికెట్లతో పదోన్నతులు కూడా పొందారు. 2009 ఫిబ్రవరిలో ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది ఇలా నకిలీ పీజీ సర్టిఫికెట్లతోనే కథ నడిపించినట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై తాజాగా  ‘సాక్షి’ కథనాలు ప్రచురిస్తుండగా..అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.  

లాడ్జీల్లో పరీక్షలు 
ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఎంఏ ఇంగ్లిష్‌ చదివి ఉండాలన్నది నిబంధన. దీంతో కొందరు ఎస్జీటీలు అడ్డదారుల్లో సర్టిఫికెట్లు పుట్టించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులకు కాసులు సమర్పించారు. వారి సహకారంతో రాత్రిళ్లు లాడ్జీల్లో పరీక్షలు రాసేశారు. వారంలో సర్టిఫికెట్లు తెచ్చేసుకుని.. విద్యాశాఖ అధికారులకు సమర్పించారు. ఇలా 77 మంది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) గుర్తింపు లేని రాజస్థాన్‌లోని విహబ్‌ యూనివర్సిటీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందినట్లు సమాచారం. 

గుడ్డిగా పదోన్నతులిచ్చిన విద్యాశాఖ 
పదోన్నతి కోసం సదరు ఉపాధ్యాయులు ఇచ్చిన సర్టిఫికెట్లు నిజమైనవా..కావా అన్న అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించుకోవాలి. ఇందుకోసం సదరు యూనివర్సిటీల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. కానీ ఎస్‌ఏ ఇంగ్లిష్‌ పోస్టు కోసం సమర్పించిన సర్టిఫికెట్ల గురించి ఏ అధికారీ ఆరా తీయలేదు. అసలు సదరు యూనివర్సిటీ దేశంలో ఉందా..లేదా అని కూడా నిర్ధారించుకోలేదు. తీరా ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏ సెక్షన్,  బీ సెక్షన్‌ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారు.

మరోవైపు వారం రోజుల్లోనే పీజీ సర్టిఫికెట్లు తెప్పించుకుని సర్వీసు రిజిష్టర్‌ (ఎస్‌ఆర్‌)లో నమోదు చేయించుకున్న కొందరు ఉపాధ్యాయులు.. ఈ వ్యవహారం రచ్చ కావడంతో అదే సబ్జెక్టుకు సంబంధించి మరో వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. తిరిగి ఆ సర్టిఫికెట్‌ ఆధారంగా ఎస్‌ఆర్‌లో నమోదు చేయించుకున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు  పట్టించుకోకపోవడంపై తెరవెనుక భారీగానే  మంత్రాంగం నడిచినట్లు తెలుస్తోంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top