జియాగూడలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య.. భయంతో పరుగులు తీసిన జనం..

Hyderabad jiyaguda Man Killed On Road People Scared - Sakshi

వేట కొడవలి, రాడ్డుతో కొట్టి చంపిన దుండగులు

మూసీలో దూకి పారిపోయిన ముగ్గురు నిందితులు

పురానాపూల్‌ జాతీయ రహదారిపై ఘటన

జియాగూడ: నగరంలోని పురానాపూల్‌ జాతీయ రహదారిపై పట్టపగలే దారుణం జరిగింది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒకరిని వేట కొడవలి, రాడ్డుతో నరికి చంపారు. కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌ చెప్పిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట్‌కు చెందిన జంగం సాయినాథ్‌ (35) కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతడు కోఠి ఇసామియా బజార్‌ నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి పురానాపూల్‌ జాతీయ రహదారిలో కార్వాన్‌ వైపు వెళ్తున్నాడు. బైక్‌పై వస్తున్న సాయినాథ్‌ను ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి రాడ్డుతో దాడి చేశారు. కింద పడవేసి వేట కొడవలితో నరికి చంపారు.

ఘటనా స్థలానికి క్లూస్‌టీం, పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునే ప్రయత్నం.. జాతీయ రహదారిలో గోషామహల్‌ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ జనార్దన్‌ పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్నాడు. సాయినాథ్‌పై దాడి జరుగుతున్నట్లు గమనించాడు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లగా వారు మూసీనదిలో దూకి పారిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయినాథ్‌ అప్పటికే మృతి చెందాడు.

ఈ దారుణం జరుగుతుండగా.. అక్కడే కొంతమంది ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఈ దారుణాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ ఘటనను సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. బైక్‌పై వస్తున్న వ్యక్తిని పథకం ప్రకారమే అడ్డగించి హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సాయినాథ్‌ హత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. జంగం సాయినాథ్‌ (ఫైల్‌)
చదవండి: డెక్కన్‌మాల్‌ ఘటన.. దొరకని మృతదేహాలు.. ఇక మిగిలింది బూడిదేనా?

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top