గుప్తనిధుల కోసం భారీ సొరంగం 

Huge tunnel for Hidden treasures - Sakshi

ఏడాదిగా 80 అడుగులు తవ్విన ముఠా 

మరో 40 అడుగుల్లో గుప్తనిధులు ఉన్నాయంటున్న ముఠా 

సాక్షి, తిరుపతి: శేషాచలంలో ఎర్రబంగారమే కాదు.. అపారమైన గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో ఓ ముఠా పథకం వేసింది. ఏడాది పాటు శ్రమించి భారీ సొరంగం తవి్వంది. మరికొంత సొరంగం తవ్వితే.. గుప్తనిధులు బయటపడేవని ముఠా సభ్యులు చెబుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలకు యత్నించిన కొందరిని శనివారం అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనకాపల్లికి చెందిన పెయింటర్‌ నాయుడు 2014లో తిరుపతికి మకాం మార్చాడు. భార్య నుంచి విడిపోయిన అతడు తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి గుప్తనిధుల మీద ఆశ మొదలైంది. నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది.
తవ్వకాల సమీపంలో రాయిపై ఉన్న గుర్తులు  

కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్తనిధి ఉందని భావించారు. నాయుడు, రామయ్యస్వామి.. ఆరుగురు కూలీలతో కలిసి ఏడాది కిందట తవ్వకాలు ప్రారంభించారు. విషయం బయటకు తెలియకుండా సొరంగం తవ్వుతూ వచ్చారు. ఏడాది పాటు గుట్టుచప్పుడు కాకుండా.. రేయింబవళ్లు 80 అడుగుల సొరంగం తవ్వారు. మరికొంత తవ్వేందుకు శుక్రవారం రాత్రి కూలీలతో బయలుదేరారు. మరికొందరి కోసం మంగళం వెంకటేశ్వరకాలనీ సమీపంలో ఎదురు చూడసాగారు. ఈ ముఠా కదలికలతో అనుమానం వచ్చిన కాలనీవాసులు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గుప్తనిధుల తవ్వకాలకు వచ్చినట్లు వారు విచారణలో తెలిపారు. వారిద్వారా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వితే సరిపోయేదని ముఠా సభ్యులు చెబుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top