ఆ స్థలం సర్కారుదే.. వెలుగులోకి కబ్జా పర్వం | Sakshi
Sakshi News home page

ఆ స్థలం సర్కారుదే.. వెలుగులోకి కబ్జా పర్వం

Published Fri, Mar 4 2022 7:15 PM

HMDA 5 Acres Land Grab Worth Crores of Rupees in Shamshabad Town - Sakshi

సాక్షి, శంషాబాద్‌: కోట్లాది రూపాయల విలువజేసే హెచ్‌ఎండీఏ భూ కబ్జా గుట్టు రట్టయింది. ఆరోపణలు, ఫిర్యాదులు వాస్తవమేనని సర్వే తేల్చిచెప్పింది. శంషాబాద్‌ పట్టణం నడిబొడ్డున చేసిన అక్రమ వెంచర్‌లో 5.15 ఎకరాల హెచ్‌ఎండీఏ భూమి అన్యాక్రాంతమైనట్లు తేలింది. దాదాపు రూ.50 కోట్ల పైచిలుకు విలువ చేసే ఈ భూమి అన్యాక్రాంతంపై హెచ్‌ఎండీఏ నిండా నిర్లక్ష్యం వహించినా స్థానికులు పోరు చేసి వాస్తవాలను బయటికి రప్పించారు.  

అసలేం జరిగింది? 
► శంషాబాద్‌ పట్టణంలోని సర్వేనంబరు 626బై1 హెచ్‌ఎండీఏకు సంబంధించి 360 ఎకరాల భూమి ఉంది. ఓఆర్‌ఆర్‌ నిర్వాసితులతో పాటు విమానాశ్రయంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఇక్కడ ప్లాట్లు కేటాయించడంతో పాటు ఖాళీ స్థలాలున్నాయి. దీని పక్కనే  ఆరేళ్ల క్రితం సర్వేనంబరు 551 నుంచి 600 వరకు సర్వే ఉన్న భూమిలో భారీ వెంచర్‌ ఏర్పాటు చేశారు. దీని పక్కనే హెచ్‌ఎండీఏకు సంబంధించిన సర్వే నంబరు 626బై1ని ఆనుకుని ఉంది.  

► ఇది పూర్తిగా గుట్ట ప్రాంతంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉండేవి. కార్పొరేట్‌ స్థాయి వ్యక్తులు వెంచర్‌లు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు స్థానిక నేతలే ఇందులో భారీగా క్రయ విక్రయాలు దగ్గరుండి మరీ చూసుకున్నారు. క్రమంగా అభివృద్ధి చేసిన వెంచర్‌లో పురాతన దేవాలయాలను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న హెచ్‌ఎండీఏ 5.15 ఎకరాల భూమిని కూడా అందులో కలిపేసుకున్నారు.   

► ఈ స్థలంలో రహదారులు వేసి అభివృద్ధి కూడా చేశారు. ఇందులో అధికార పార్టీ నేతల నుంచి కొందరు హెచ్‌ఎండీఏ మాజీ అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. ఇదే సర్వేనంబరు హెచ్‌ఎండీఏకు సంబంధించిన మరో 6.29 ఎక రాల భూమిలో రైతులు కబ్జాలో కొనసాగుతున్నారు. ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదంగానే ఉంది.  (క్లిక్‌: దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం)

నిండా నిర్లక్ష్యం
► పునరావాసం కింద కేటాయించిన స్థలాలతో పాటు హెచ్‌ఎండీఏ మిగులు స్థలాలపై ఆది నుంచీ నిండా నిర్లక్ష్యం కొనసాగుతోంది.  ఇదే అదనుగా ఇప్పటికే కొందరు నకిలీ దస్తావేజులతో ఒకే ప్లాటు నలుగురైదుగురికి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆర్‌డీఓ జారీ చేసినట్లు నకిలీ పట్టా సర్టిఫికెట్‌లు సృష్టించిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.  ఆర్‌డీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అక్రమార్కులను కటకటాల్లోకి పంపారు.  

► ఇటీవల హెచ్‌ఎండీఏ భూమి కబ్జాపై  స్థానికులతో పాటు  కొందరు ప్రజాప్రతినిధులు కూడా సీఎంఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిసెంబరు 29 రెవిన్యూ అధికారులు సర్వే పనులు షురూ చేశారు. రెండు రోజుల క్రితం సర్వే పూర్తి చేసి అధికారులకు నివేదిక అందించారు. కబ్జా జరిగింది వాస్తవమేనని తేల్చారు. త్వరలోనే సంబంధిత భూమిని స్వాధీనం చేసుకునేందుకు హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. (క్లిక్‌: హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే)

కబ్జా వాస్తవమే.. 
జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పట్టణంలోని సర్వేనంబరు 626బై1 ఉన్న హెచ్‌ఎండీఏకు సంబంధించిన 360 ఎకరాలతో పాటు సమీపంలో ఉన్న స్థలాను సర్వే పూర్తి చేశాం. హెచ్‌ఎండీకు సంబంధించిన 5.15 ఎకరాల భూమి వెంచర్‌లో కలిసినట్లు తేలింది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలకు సూచించాం. సర్వే నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశాం. 
– జనార్దన్‌రావు, శంషాబాద్‌ తహసీల్దార్‌     

Advertisement
 
Advertisement
 
Advertisement