‘రూ.25 కోట్ల డిమాండ్‌’పై విజిలెన్స్‌ దర్యాప్తు

Heard of Rs 25 crore deal to let off Aryan Khan, says NCB witness - Sakshi

జ్ఞానేశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని త్రిసభ్య బృందం ఏర్పాటు 

ఆదేశాలు జారీ చేసిన ఎన్‌సీబీ

న్యూఢిల్లీ: ముంబై తీరంలో క్రూయిజ్‌ షిప్‌లో పట్టుబడిన డ్రగ్స్‌ కేసులో నిందితుడైన ఆర్యన్‌ ఖాన్‌ను విడిచిపెట్టడానికి రూ.25 కోట్లు డిమాండ్‌ చేశారంటూ ప్రభాకర్‌ సాయిల్‌ అనే సాక్షి సమర్పించిన అఫిడవిట్‌పై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) వేగంగా స్పందించింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేతోపాటు మరికొందరు అధికారులపై ప్రభాకర్‌ సాయిల్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

విజిలెన్స్‌ దర్యాప్తు కోసం ఎన్‌సీబీ ఉత్తర రీజియన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జ్ఞానేశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలో త్రిసభ్య బృందం ఏర్పాటయ్యింది. జ్ఞానేశ్వర్‌ సింగ్‌ ఎన్‌సీబీ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌(సీవీఓ)గానూ పనిచేస్తున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ను విడిచిపెట్ట్టడానికి రూ.25 కోట్లు ఇవ్వాలంటూ ఎన్‌సీబీ కీలక అధికారులతోపాటు ఈ కేసులో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు డిమాండ్‌ చేశారని ప్రభాకర్‌ సాయిల్‌ ఆదివారం బాంబు పేల్చాడు.

ఈ మేరకు ముంబై పోలీసులకు అఫిడవిట్‌ అందజేశాడు. డ్రగ్స్‌ కేసులో మరో సాక్షి అయిన కె.పి.గోసవికి ప్రభాకర్‌ సాయిల్‌ బాడీగార్డుగా పనిచేస్తున్నాడు. ప్రభాకర్‌ సాయిల్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని డ్రగ్స్‌ కేసులో మరో సాక్షి కిరణ్‌ గోసవి పేర్కొన్నాడు. క్రూయిజ్‌ షిప్‌పై ఎన్‌సీబీ దాడులు జరిగిన అక్టోబర్‌ 2 నుంచి  పరారీలో ఉన్న అతడు సోమవారం గుర్తుతెలియని ప్రాంతం నుంచి టీవీ చానళ్లతో మాట్లాడాడు. తాను అతి త్వరలో లక్నో పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పాడు.  

పారదర్శకంగా దర్యాప్తు
ప్రభాకర్‌ సాయిల్‌ సమర్పించిన అఫిడవిట్, కేసు రిపోర్టు ముంబైలోని తమ అధికారుల నుంచి అందిందని జ్ఞానేశ్వర్‌ సింగ్‌ సోమవారం ఢిల్లీలో చెప్పారు. ఈ రిపోర్టును ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌పరిగణనలోకి తీసుకున్నారని, విజిలెన్స్‌ దర్యాప్తునకు ఆదేశించారని వెల్లడించారు. సిబ్బందిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా పారదర్శకంగా, నిజాయతీగా దర్యాప్తు జరుపుతామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్‌ వాంఖెడేను డ్రగ్స్‌కేసు విచారణ నుంచి తప్పించడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాలను బట్టి చర్యలుంటాయన్నారు. విజిలెన్స్‌ దర్యాప్తులో భాగంగా వాంఖెడేను, ఇతర అధికారులను, సాయిల్‌ను నిశితంగా ప్రశ్నించనున్నట్లు ఎన్‌సీబీ వర్గాలు వెల్లడించాయి. కాగా, సమీర్‌ వాంఖెడే సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్‌సీబీ ఉన్నతాధికారులెవరూ తనను పిలిపించలేదని, వేరే పని కోసం ఇక్కడికి వచ్చానన్నారు.

సాయిల్‌కు పోలీసు భద్రత
ముంబై డ్రగ్స్‌ కేసులో సాక్షి అయిన ప్రభాకర్‌ సాయిల్‌కు పోలీసు భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌వాల్సే పాటిల్‌ ప్రకటించారు. సాయిల్‌ సోమవారం ముంబై పోలీసు కమిషనర్‌ కార్యాలయానికి వచ్చాడు. జాయింట్‌ కమిషనర్‌(క్రైమ్‌) మిలింద్‌ను కలిసి మాట్లాడాడు. అనంతరం ముంబై శివారులోని సహర్‌ పోలీసులను కలిశాడు. తనకు భద్రత కల్పించాలని కోరాడు.

విచారణకు అనన్య పాండే డుమ్మా
డ్రగ్స్‌ కేసులో  నటి అనన్య పాండే సోమవారం ఎన్‌సీబీ ఎదుట విచారణకు హాజరు కాలేదు.  ఇంతకుముందే రెండు రోజులపాటు ఎన్‌సీబీ ఆమెను ప్రశ్నించింది. సోమవారం మళ్లీ రావాలని సూచించినప్పటికీ రాలేదు.  

వాంఖెడే ఫోర్జరీ సర్టిఫికెట్లు: నవాబ్‌ మాలిక్‌
ఎన్‌సీబీ జోనల్‌ డెరెక్టర్‌ సమీర్‌ వాంఖెడే పుట్టినతేదీ  సహా సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి, ఉద్యోగంలో చేరారని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ ఆరో పించారు. సోమవారం సదరు సర్టిఫికెట్లను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ ఆరోపణలను వాంఖెడే కొట్టిపారేశారు. ఈ కేసులో నవాబ్‌ మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌ను వాంఖెడే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

వాంఖెడేకు ఉపశమనం సాధ్యం కాదు: ప్రత్యేక కోర్టు
ముంబై: డ్రగ్స్‌ కేసులో సాక్షి ప్రభాకర్‌ సాయిల్‌ అఫిడవిట్‌ ఆధారంగా న్యాయస్థానాలు తనపై ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ముంబైలోని స్పెషల్‌ కోర్టును ఆశ్రయించిన సమీర్‌ వాంఖెడేకు నిరాశే ఎదురయ్యింది. అలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్‌సీబీ, సమీర్‌ వాంఖెడే సోమవారం ప్రత్యేక కోర్టులో రెండు వేర్వేరు అఫిడవిట్లు దాఖలు చేశారు. డ్రగ్స్‌ కేసులో విచారణకు అడ్డంకులు సృష్టించడానికి ప్రభాకర్‌ సాయిల్‌ ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఎన్‌సీబీ, వాంఖెడే తమ అఫిడవిట్లలో పేర్కొన్నారు. తనపై, తన కుటుంబ సభ్యులపై పెద్ద కుట్ర జరుగుతోందని వాంఖెడే చెప్పారు. తమను నైతికంగా దెబ్బతీసే యత్నం జరుగుతోందన్నారు. అందుకే తమపై న్యాయస్థానాలు చట్టపరమైన చర్యలు ప్రారంభించకుండా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. అయితే, ఈ కేసులో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రత్యేక జడ్జి వి.వి.పాటిల్‌ స్పష్టం చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top